ఇటీవల కృష్ణాజిల్లా చింతపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో వెలుగుచూసిన.. అధ్వానంగా ఉన్న భోజనంపై విచారణ కొనసాగుతుండగా.. ఇతర విద్యాలయాల్లోనూ అదే తీరుగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మారిన మెనూ ఏదీ?
జిల్లాలో 3063 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుండగా.. 2,54,048 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి పాఠశాల భోజనం నాసిరకంగా ఉంటుందని సగానికి పైగానే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. ప్రతి పాఠశాలలోనూ మధ్యాహ్న భోజన సమయంలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా రూపొందించిన నూతన మెనూ అనేక పాఠశాలల్లో అమలుకావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 30 శాతం పాఠశాలల్లో పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కనీసం మెనూపై అవగాహన కోసం ఏజెన్సీలకు ఇంతవరకు శిక్షణ ఇవ్వలేదు. పాఠశాలల ఉపాధ్యాయులకు సమాచారం అందించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. కొన్నిచోట్ల నూతన మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఉపాధ్యాయులు చెబుతున్నా ఏజెన్సీలు అమలు చేయడం లేదు. మరికొందరు ఏదో నామమాత్రంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పర్యవేక్షణ బాధ్యత ఉపాధ్యాయులదేనా?
మధ్యాహ్న భోజన పథక అమల్లో ప్రధాన బాధ్యత ఉపాధ్యాయులదే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇ-హాజరు మొదలుకొని, అనేక రకాలైన యాప్‌లలో సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికే సమయం సరిపోతోంది. పాఠశాలల పర్యవేక్షణతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాల్సిన సీఆర్పీలు నామమాత్రంగా సందర్శించి వెళ్లిపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సరైన పర్యవేక్షణ కొరవడింది. నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులు గ్రామవాలంటీర్లకు అప్పగించి చేతులు దులుపేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోకుండా ప్రతీదీ తమపైనే నెట్టేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
కట్టెల పొయ్యిలే దిక్కు..
జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు గ్యాస్‌స్టౌల సౌకర్యం ఉండగా, వాటిని ఉపయోగించి వండటానికి ఏజెన్సీ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. గ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో చాలా పాఠశాలల్లో కట్టెల పొయ్యిలే వినియోగిస్తున్నారు. రాయితీ గ్యాస్ బండలు అందిస్తేనే భోజన ధరలకు అనుగుణంగా వండుతామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దానికితోడు పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, వంటనూనెలు వారికి మరింత భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అపరిశుభ్రంగా పరిసరాలు..
వంట చేసే ప్రదేశంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కొన్ని ఏజెన్సీల నిర్వాహకులు శ్రద్ధ చూపడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. చెత్తాచెదారంలోనే బియ్యం కడగడం, కూరలు తరగడం వల్ల ఈగలు, దోమలు ముసురుతున్నాయని చెబుతున్నారు. వంట చేసే సమయంలో ప్రధానోపాధ్యాయులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల వంట గదులు లేవు. కొన్నిచోట్ల సైకిల్ స్టాండ్ల నిమిత్తం దాతలు ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులోనే వంట చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆరుబయటే వండుతున్నారు. సరకులు భద్రపరుచుకోవడానికి, వండిన పదార్థాలు వడ్డించే వరకైనా దాచిపెట్టడానికి తగిన చోటు ఉండడం లేదు.
ప్రత్యేక శ్రద్ధ..
ప్రభుత్వం సూచించిన మెనూను కచ్చితంగా అమలు చేయాల్సిందే. దీనిలో ఎలాంటి సర్దుబాట్లు కుదరవు. మూడంచెల విధానంలో పరిశీలించిన తరవాతే చిన్నారులకు భోజనం అందించాలి. పరిసరాల పరిశుభ్రత, నాణ్యమైన సరకుల వినియోగంపై ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మరింత శ్రద్ధగా పర్యవేక్షించాలి. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవు. - కొల్లాటి నరేశ్‌కుమార్, ఎంఈవో, ముదినేపల్లి, కలిదిండి
ఇదీ చదవండి: