Impact of Tax and Incidence of Tax: విజయవాడలో సుమారు 12లక్షల 50వేల మంది ప్రజలు లక్షా 92వేల కుటుంబాలు జీవిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే నగర పాలక సంస్థ విధిస్తున్న పన్నులకు సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఉన్నపన్నులనే కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడ్తుంటే.. వీఎంసీ గత నెల నుంచి మరోసారి ఆస్థిపన్నుపెంచింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సతమతమవుతున్న తమపై మరోసారి పన్నుల భారం వేయడమేంటని బెజవాజ ప్రజలు వాపోతున్నారు.
గతంలో.. ఇంటిపన్నులోనే కుళాయి, చెత్తపన్ను కలిపి కట్టేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్తపన్ను, కుళాయి పన్ను వేర్వేరుగా వసూలు చేస్తోంది. ఈ పన్నుల మోతపై నగర వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో చెత్తపన్ను నెలనెలా వసూలు చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆరు నెలలకోసారి ఇంటి పన్నుతో కలిపి వసూలు చేయాలని భావిస్తోంది.
మురికివాడల్లో కుటుంబానికి 30 రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 120 రూపాయల చెత్త పన్నును విధిస్తున్నారు. గత ఏప్రిల్ నెల నుంచి ఇంటి పన్ను మరింత పెంచారు. కరెంట్ ఛార్జీలను సైతం పలు పేర్లతో అధిక మొత్తంలో ప్రభుత్వం వసూలు చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు తోడు ప్రభుత్వం విధిస్తున్న ఈ పన్నులు ప్రజలకు భారంగా మారాయని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఇంటి పన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకపక్క సరైన ఉపాధిలేక అవస్థలు పడుతున్న తమపై నగరపాలక సంస్థ పన్నుల భారం మోపటం సమంజసం కాదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం నీటిపన్ను, ఇంటిపన్ను, చెత్తపన్నులను సమాన్యులపై విధిస్తోంది. మరోవైపు విద్యుత్ ఛార్జిలు పెంచుతోంది. వీటితో పాటు పెరుగుతున్న నిత్యావసర ధరలు వల్ల మాలాంటి వాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పైగా ఇంటి అద్దెలు కట్టుకుంటూ.. ఇలా పెంచుతున్న పన్నులను చెల్లించటం అదనపు భారంగా మారంది. ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాలని కోరుతున్నాము."
- స్వరూపారాణి, విజయవాడ వాసి
"రాష్ట్రంలో ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపే కార్యక్రమం జరుగుతోంది. ఇంటిపన్నులు, నీటి ఛార్జీలు పెంచారు. చెత్తపన్నులు కూడా విధించారు. వీటన్నింటినీ ప్రజల నుంచి బలవంతగా వసూలు చేయాలని చూస్తున్నారు. ఏ పనికి వెళ్లాలన్నా మున్సిపల్ అడ్మిస్ట్రేషన్లో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇంత నగదు చెల్లించినా.. జవాబుదారీతనం లేదు. రాష్ట్రంలో ప్రతి రంగంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ.. ప్రభుత్వం ఇలా పన్నుల భారం విధించటం వల్ల ప్రజలకు జీవనం కష్టతరం అవుతోంది. ఇలా ప్రతి ఏడాది పన్నులు పెంచుకుంటూ పోతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే.. ప్రజలను ఇలా దారణంగా దోచుకుంటున్నారు." - ఆంజనేయులు, విజయవాడ నివాసి
"మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం.. ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి.. ప్రజల అవసరాలు, సౌకర్యాల కోసం వినియోగించాలి. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసేది కొండంత అయితే అభివృద్ధి చేసేది గోరంత."
- జీ. కోటేశ్వరరావు, సీపీఐ నేత
ఇదీ చదవండి: