కృష్ణా జిల్లాలో తెలంగాణ మద్యం ఏరులై పారుతోంది. లాక్ డౌన్ లో మద్యం దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచారు. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విపరీతంగా అమ్మకాలు జరిగాయి. సాధారణంగా మద్యం ప్రియులు వినియోగించే ఓ సంస్థ క్వార్టర్ సీసా ధర దుకాణంలో 350గా ఉంటే... తెలంగాణలో 160కే లభిస్తోంది. అంటే వ్యత్యాసం 190 రూపాయలు ఉంది.
ఇదే అదనుగా కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు దాదాపు 40 రోజుల తర్వాత తెరుచుకున్నాయి. కానీ మద్యం అమ్మకాలు మాత్రం తగ్గలేదు. రాత్రి 7 గంటల వరకే అమ్మకాలు కొనసాగించాల్సి ఉంది. కానీ చాటుమాటుగా 11 గంటల వరకు విక్రయిస్తున్నారు. 180 రూపాయలకు అమ్మాల్సిన మద్యం సీసాను 250కు విక్రయిస్తున్నారు. మద్యం అలవాటు మాన్పించేందుకు దుకాణాలు, అమ్మకాలపై ప్రభుత్వం నిబంధనలు విధిస్తే ఏకంగా పన్ను చెల్లించని మద్యం చెలామణిలోకి వచ్చింది.
జిల్లాలో ఉన్న 265 దుకాణాల్లో ప్రస్తుతం 174లో మాత్రమే అమ్మకాలు చేస్తున్నారు. రెడ్ జోన్లలో ఉన్న సిబ్బందితో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరిట మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా తీసుకెళ్తున్న బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 22నుంచి మే 10వరకు అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై 132 కేసులు నమోదు చేసి 8 లక్షల విలువ చేసే 2144 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 38 ద్విచక్రవాహనాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: