హైదరాబాద్లో ఈ పరిస్థితి కేవలం ఈ నాలుగు ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు. దాదాపు చాలా చోట్ల ఇలాంటి అడ్డు‘కట్టెలు’ దర్శనమిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లను అడ్డుకొనేందుకు గ్రామాలు పాటించిన ఈ విధానం మహానగరానికి పాకింది.
కరోనా నేపథ్యంలో ఎవరికి వారు తమ ప్రాంతాల్లో రాకపోకలు సాగించకుండా చేసుకుంటున్న ఈ ఏర్పాట్లు అత్యవసర సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ అనధికారిక మూసివేత నిర్ణయాల వల్ల అమీర్‌పేట, చింతలబస్తీ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తీసుకువెళ్లే 108 వాహన సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోగిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడం వల్ల కొంతమంది ప్రాణాపాయ స్థితికీ చేరుకున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నివసించే వారూ రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని, వ్యాధి ప్రభావం లేని కాలనీల్లో ఈ అనధికారిక అడ్డుకట్టలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యామ్నాయం లేనిచోటా...
గ్రేటర్ పరిధిలోని కొన్ని గల్లీలు, కాలనీలకు వెళ్లేందుకు ఒకటే మార్గం ఉంటుంది. ప్రత్యామ్నాయ దారులు లేనిచోటా అడ్డుకట్టలు కట్టడం గమనార్హం. ఒకవేళ ఉన్నా తెలియని వారు వాటిని వెతుక్కుంటూ వెళ్లడానికి చాలా సమయం వెచ్చించాల్సి వస్తోంది.
పాలు, కూరగాయల వాహనాలు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది ఆ దారులు వెతుక్కొని వెళ్లేందుకు ఇక్కట్లు పడుతున్నారు. ముందుచూపు మంచిదే అయినా ఆయా ప్రాంతాల్లో ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంబులెన్సులు, ఇతర సేవలు అందించేందుకు జాప్యమవుతోంది.
ప్రభుత్వం వద్దన్నా వినడంలేదు...
అత్యవసర సేవలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో కంటెయిన్‌మెంట్ జోన్లు లేనిచోట్ల ఇలాంటి అడ్డుకట్టలు తొలగించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కాలనీల్లో సొంతగా ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలని అనేకమంది కోరుతున్నా ఇప్పటికీ కొన్ని బస్తీల్లో ఇదే పద్ధతి కొనసాగుతోంది.
ఇవీ చూడండి...