Endangered Sea Turtles: మానవాళికి మేలు చేసే సముద్ర జీవుల్లో తాబేళ్లను అగ్రగామిగా చెబుతారు.. అలాంటి తాబేలు లేదా కూర్మము.. ఇవి ట్రయాసిక్ యుగం సముద్ర తాబేళ్లు.. భూమి మీద ఉన్న అతి ప్రాచీనమైన సరీసృపాలు.. 24.5 కోట్ల సంవత్సరాల నుండి ఎలాంటి మార్పులు లేకుండా జీవించియున్న దృఢమైన పైకప్పుగల ప్రాచీన సరీసృపాలు. ఈ జాతి తాబేళ్లు 100 నుండి 150 సంవత్సరాలు కాలం వరకు జీవించి ఉంటాయి.. ఇవి సముద్ర సంచార జీవులు.. సుమారు 20,000 కిలోమీటర్లు వరకు ఆహారం కోసం మరియు గుడ్లు పెట్టడం కోసం వలస వెళతాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఏడు రకాల సముద్ర తాబేళ్లు జాతులు ఉన్నవి. వీటిలో అయిదు రకాలు భారత దేశంలో ఉన్నవి అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ఎక్కువగా వచ్చేవి అలీవ్ రిడ్లీ తాబేళ్లు. సముద్ర తాబేలు సుమారుగా 90 నుండి 165 గుడ్లు ఒకేసారి పెడుతుంది. ఇక్కడ జన్మించిన ఈ జాతి తాబేళ్లు క్రమం తప్పకుండా పది సంవత్సరాలకు ఇక్కడికే వచ్చి గుడ్లు పెట్టి.. తమ సంతతిని పెంపొందించుకోవటం ఈ జాతి తాబేళ్ల ప్రత్యేకత.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తాబేళ్ల సంరక్షణ, పురుత్పత్తి కేంద్రాలకు ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తుంది. ఏలూరు వైల్డ్ లైఫ్ విభాగం పర్యవేక్షణలో అవనిగడ్డ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు సాగర సంగమ ప్రదేశంలో, నాగాయలంక లైట్ హౌస్, సంగమేశ్వరం, సోర్లగొంది, ఈలచేట్లదిబ్బలో ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్లు గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పతి కేంద్రాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు.
తాబేళ్లు గుడ్లు పెట్టడానికి సముద్రం ఒడ్డుకు వచ్చే సమయంలో మత్స్యకారులకు తమ బోటు ఫ్యాన్ రెక్కలు తగలకుండా మెస్ ఏర్పాటు, వలలో చిక్కుకుపోకుండా సముద్ర తాబేళ్ల సంరక్షణపై అవగాహన కలుగజేయడంలో ప్రతి సంవత్స్రరం అటవీశాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. ఫలితంగా వేలాది తాబేళ్లు బోటు ఫ్యాన్లు తగిలి మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల సేకరణలో కూడా నిపుణులైన సిబ్బందిని పెట్టకపోవడంతో ఎక్కువమంది సిబ్బంది లేకపోవడంతో తాబేళ్లు పెట్టిన గుడ్లు అడవి నక్కలపాలవుతున్నాయి.
సముద్ర కాలుష్యం, తాబేళ్లు వలలలో పడటం, బోటు ఫ్యాన్ రెక్కలకు తగలడం వలన మృత్యువాత పడి అంతరించిపోతున్న అరుదైన తాబేళ్ల సంరక్షణ కొరకు తీరప్రాంతంలో ఉన్న మత్య్సకారులకు, ప్రజలకు స్వచ్చంద సంస్థల సాయంతో అవగాహన సదస్సులు నిర్వహించడం, తాబేళ్లు వచ్చే సరైన సమయంలో పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంతరించిపోతున్న తాబేళ్లను కాపాడుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: