కుట్రపూరిత యత్నాలు, ఫోన్ సంభాషణలు, లేఖపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని న్యాయవాదులు సోమవారం హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి వారు తమ వాదనలు వినిపించగా వాటిని విన్న న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. కరోనా ఉన్నందున హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తు జరిపించాలని ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య’ సభ్యుడు లక్ష్మినరసయ్య ఇటీవల హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి వాదనలు వినిపించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు.
ఆడియో టేపులో సంభాషణలు అభ్యంతరకరం
‘న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను కోర్టు ముందుకు తీసుకురావడం కోసం అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాం. ఆధారాలను సమర్పించేందుకు అనుమతివ్వండి. న్యాయవ్యవస్థకు, జడ్జిలకు దురుద్దేశాలు ఆపాదించేలా, అపఖ్యాతిపాలుచేసేలా ఫోన్ సంభాషణ ఉంది. కుట్రపూరితయత్నాలపై, ఫోన్ సంభాషణలపై సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా మరే విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించండి. ‘ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్’కు ప్రస్తుతం పిల్ దాఖలు చేసిన ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య’ అనుబంధ సంఘం. ఆ రెండు సంఘాల మధ్య సహకారం ఉంది. న్యాయవ్యవస్థపై ఆడియో టేపులో సంభాషణలు అభ్యంతరకరం.’
- జడ్జి రామకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది ఏఎన్‌జీ వేణుగోపాలగౌడ
చర్చల్లో ఎలా పాల్గొంటారు
‘హైకోర్టు సిట్టింగ్ జడ్జిని అపఖ్యాతి పాలుచేసేందుకు యత్నించగా జడ్జి రామకృష్ణను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి కోర్టుకొచ్చి నేను న్యాయవ్యవస్థను రక్షిస్తానంటున్నారు. ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్‌తో తమ సంస్థకు సంబంధం ఉందని ఏ విధంగా చెబుతారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు న్యాయాధికారి మీడియా ముందుకు ఎలా వెళతారు. చర్చల్లో ఎలా పాల్గొంటారు. జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేయండి.’
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య తరఫు న్యాయవాది అద్నాన్ మహమ్మద్
తీవ్రంగా పరిగణించాలి
‘హైకోర్టు ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ మృతి విషయంపై ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఈ ఏడాది జూన్ 29న రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు సీజే, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లేఖ రాసింది. ఆ లేఖకు పిటిషన్‌లోని అఫిడవిట్‌కు మధ్య ఉన్న దగ్గరి సంబంధంపై విచారణ జరపాలి. దీనిని తీవ్రంగా పరిగణించాలి. హైకోర్టుపై కుట్ర విషయంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. అప్పుడు వాస్తవం బయటకొస్తుంది. జ్యుడీషియరీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారితో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా దుర్భాషలాడుతున్న ప్రతి ఒక్కరిపైనా విచారణ జరపాలి.’
- హైకోర్టు తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్
ఆయా అంశాలపై కౌంటర్ వేస్తాం
జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లో జస్టిస్ ఈశ్వరయ్యకు ప్రభుత్వానికి ముడిపెడుతూ రాసిన వివరాలు అభ్యంతరకరం. ఆయా అంశాలపై కౌంటర్ వేస్తాం.
- ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్
పిల్‌లో కోరింది వేరు.. జడ్జి రామకృష్ణ కోరుతోంది వేరు
‘కరోనా విషయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను హైకోర్టులో పాటించడం లేదని చెప్పేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్యకు ఈ విషయంలో ఏమి నైపుణ్యం ఉంది? ఏ అర్హతతో పిల్ దాఖలు చేశారు. జడ్జి రామకృష్ణకు అనుబంధ పిటిషన్లు దాఖలు చేయడానికి అర్హత లేదు. పిల్‌లో కోరింది వేరు.. జడ్జి రామకృష్ణ కోరుతోంది వేరు.
- కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) హరినాథ్
మీడియా సమావేశం ఎలా నిర్వహిస్తారు: ధర్మాసనం
ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్-16 ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి జడ్జి రామకృష్ణ మీడియా ముందుకు ఎలా వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. మీడియాతో సంబంధాన్ని ఆ నిబంధన నిషేధిస్తోందని గుర్తు చేసింది. సీనియర్ న్యాయవాది వేణుగోపాలగౌడ స్పందిస్తూ.. జడ్జి రామకృష్ణ ప్రవర్తనపై (కాండక్ట్) విచారణ జరపవచ్చని, మీడియా ముందుకు వెళ్లిన విషయంపై తనకు సమాచారం లేదని చెప్పారు. ఫోన్ సంభాషణపై సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీం విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చూడండి. రెండు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు