విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. నందిగామ-కంచికర్ల వద్ద బైపాస్ రోడ్డు పనులు పూర్తికాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై, నందిగామ-కంచికర్ల వద్ద బైపాస్ రోడ్డు విస్తరణ పనులు 2018లో ప్రారంభించారు. దీని కోసం రూ. 360 కోట్లు మంజూరు చేశారు. నందిగామ వద్ద 7 కిలోమీటర్లు, కంచికర్ల వద్ద 7 కిలోమీటర్లు చొప్పున బైపాస్ రోడ్డు 6 వరుసల రహదారిగా విస్తరించాల్సి ఉంది. ఈ పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సి ఉంది. కానీ నందిగామ సమీపంలో అంబర్పేట అడ్డురోడ్డు వద్ద వెహికల్ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి నిర్మించినప్పటికీ.. దీనికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు వేసేందుకు అవసరమైన స్థలం కేటాయించలేదు. దీంతో రహదారి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
హైవే బైపాస్ రోడ్డు విస్తరణ పనులు పూర్తికాకపోవటంతో.. ప్రస్తుతం నందిగామ-కంచికర్ల మీదుగా వన్ వే మీదుగా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. వన్ వే కావటం.. ఎక్కువ వాహన రద్దీ ఉండటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
గత 10 నెలల కాలంలో నందిగామ వద్ద 20 ప్రమాదాలు జరగ్గా... 11 మంది మృతి చెందారు. కంచికర్ల వద్ద జరిగిన 10 ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. హైవే నిర్మాణం పూర్తైతే వాహన రద్దీ తగ్గి.. ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. హైవే బైపాస్ రోడ్డు పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'లోడ్ ఎక్కువైతే 40వేలు ఫైనా.. వైకాపాది తుగ్లక్ పాలన'