ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో తనపై జరుగుతున్న ఓ కేసు విచారణను కొట్టివేయాలంటూ కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రత్యేక న్యాయస్థానానికి కేసును విచారించే పరిధి లేదన్న కారణంతో దానిని కొట్టివేయలేమని స్పష్టంచేసింది. మరోవైపు తన పై అభియోగం మోపిన నాటికి తాను ఎమ్మెల్యే, ఎంపీ కాదని అందువల్ల ఆ కేసును ప్రత్యేక న్యాయస్థానం విచారించడానికి వీల్లేదన్న పార్థసారథి వాదనతో ఏకీభవించింది. కేసు విచారణను విజయవాడలోని మొదటి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు ఇటీవల తీర్పుచెప్పారు.
విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి గతేడాది మార్చిలో హైకోర్టును ఆశ్రయించారు. అదనపు పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘పెనమలూరు శాసనసభ నియోజకవర్గానికి 2009 ఏప్రిల్ 3న పార్థసారథి నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాలను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో రెండు కేసులు ఆయనపై పెండింగ్‌లో ఉన్న విషయాన్ని నామినేషన్లో దాచారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆ విషయం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారించిన అధికారులు ఈ విషయం వాస్తవమేనన్న నిర్థారణకు వచ్చి.. విజయవాడ మొదటి ఎంఎం కోర్టులో 2012 సెప్టెంబర్ 24న ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ ఫిర్యాదును విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్న మెజిస్ట్రేట్ ఆ తర్వాత ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు’ అని తెలిపారు.
వాదనలు విన్న న్యాయమూర్తి నేరానికి పాల్పడ్డ నాటికి ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలు అయితేనే వారిపై కేసులను ప్రత్యేక న్యాయస్థానం విచారించవచ్చన్నారు. పిటిషనర్ నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న తేదీకి ఆయన ఎంపీ/ఎమ్మెల్యే కాదని గుర్తుచేశారు. ఈనేపథ్యంలో ప్రత్యేక న్యాయస్థానానికి ఈ కేసును విచారించే పరిధి లేదన్నారు. ఆ కారణంతో క్రిమినల్ కేసును కొట్టివేయలేమని మొదటి ఎంఎం కోర్టుకు కేసును బదిలీ చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీచదవండి