కుక్క ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు ముద్రించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తప్పులు లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వలేరా ? అని అధికారుల్ని నిలదీసింది. ఓటర్ల జాబితాలోకి కుక్క ఫొటో ఎలా వచ్చిందనే విషయాన్ని పరిశీలించకుండానే గుర్తింపు కార్డు ఎలా ముద్రించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన అధికారులెవరంటూ ఆరా తీసింది. మరోవైపు ఒకే వ్యక్తికి వేర్వేరు ఇంటి నంబర్లతో 12 చోట్ల ఓటు హక్కు కల్పించడంపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.
అభ్యంతరాలు స్వీకరించకుండా, ఓటర్ల జాబితాలో సవరణలు చేయకుండా ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్‌కు సంబంధించి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయబోతున్నారని పేర్కొంటూ ఎస్‌వీ చిరంజీవి, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. వారి న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితాలో పలు తప్పులు దొర్లాయని.... కుక్క ఫొటోతో గుర్తింపు కార్డు ముద్రించారన్నారు. వెంకటసాయి మహేష్ సన్నిధి అనే వ్యక్తికి 12 చోట్ల ఓట్లు కల్పించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జాబితాలో జరిగిన తప్పుల్ని సవరిస్తున్నామన్నారు. జాబితాలో తప్పులకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు స్వల్ప గడువు కోరగా... అందుకు కోర్టు అనుమతించింది.
ఇదీ చూడండి: