కృష్ణాజిల్లా కొండపల్లి రిజర్వ్ అటవీ భూములను ఆక్రమించుకొని అక్రమ మైనింగ్ , ఆ గనుల రవాణాకు పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం మేజర్ కెనాల్ ను 8.6 కి.మీ వరకు పూడ్చివేయడంపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. పంట పొలాలకు నీటిని అందించే కాలువను పూడ్చివేస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.
తదుపరి విచారణతో ఆ వ్యవహారంపై తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. విచారణను ఈ నెల 30 కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కొండపల్లి అటవీ ప్రాంత భూమిని ఆక్రమించి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న పలువురు .. వారి కార్యకలాపాలు కొనసాగించడం కోసం పరిటాల గ్రామ పరిధిలోని 8.6 కి.మీ పరిధి వరకు పంట కాలువను కనుమరుగు చేశారని ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ వేశారు.
ఇదీ చదవండి: