రెండ్రోజుల్లో హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై... పది గంటల పాటు సాగిన ప్రయాణం... పసిపిల్లల నుంచి పండుముదుసలి దాకా నరకప్రాయాన్ని తలపించింది. నల్గొండ నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే రెండు గంటలు.. రద్దీ ఎక్కువగా ఉంటే రెండున్నర గంటలు. కానీ గత రెండ్రోజుల్లో అందుకు భిన్న వాతావరణం కనిపించింది. బుధవారం తెల్లవారుజామున చౌటుప్పల్ చేరుకున్న ప్రయాణికుడు.. హైదరాబాద్ చేరేందుకు మధ్యాహ్నం దాటింది. జంటనగరాల్లో కురిసిన భారీ వర్షాలకు.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనామ్ గూడ వద్ద రహదారి దెబ్బతింది. అక్కడ ఒక వాహనం ప్రవేశించడానికి మాత్రమే అనుమతించడంతో.. ఇరువైపులా రద్దీ ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు.. ఇనామ్ గూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటి అంబర్ పేట శివారు వరకు నిలిచిపోయాయి.
10 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ఇటు హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు.. దండుమల్కాపురం నుంచి ఇనామ్ గూడ వరకు ఆగిపోయాయి. కొత్తగూడెం వద్ద వంతెన.. హైదరాబాద్ వైపున దెబ్బతింది. దీంతో కొద్దిసేపు విజయవాడ వెళ్లే వాటిని.. మరికొంత సేపు హైదరాబాద్ పయనించే వాహనాల్ని వంతుల వారీగా అనుమతించారు. దండుమల్కాపురం నుంచి ఇనామ్ గూడ వరకు ఇంచుమించు.. 10 కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడింది. దారి మళ్లించేందుకు గాను కార్లు, చిన్న సరకు రవాణా వాహనాల్ని... తుఫ్రాన్ పేట నుంచి దండు మైలారం మీదుగా ఇబ్రహీంపట్నం వైపు పంపించారు.
గంట ప్రయాణానికి 9 గంటల సమయం
చౌటుప్పల్ నుంచి హైదరాబాద్కు గంటలో చేరుకోవచ్చు. కానీ నిన్న అందుకు.. తొమ్మిది గంటలు పట్టింది. నల్గొండ నుంచి ఉదయం ఆరింటికి బయల్దేరిన బస్సు.. దిల్‌సుఖ్‌నగర్ వరకే మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంది. ఇక అక్కణ్నుంచి ఎంజీబీఎస్ వరకు వెళ్లాలంటే మరింత సమయం తప్పనిసరి. తెల్లవారుజామునైతే పరిస్థితి మరీ ఘోరం. నాలుగు గంటలకు చౌటుప్పల్ వచ్చిన లారీ.. 17 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెం వంతెన చేరడానికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. అల్పాహారం, తాగేందుకు మంచినీళ్లు దొరక్క చాలా మంది ఆకలితో అలమటించారు. దండుమల్కాపురం నుంచి ఇనామ్ గూడ వరకు పెద్దగా హోటళ్లు కూడా లేకపోవడంతో.. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చేరుకునే వారు... రద్దీ నుంచి బయటపడేందుకు... నడక మార్గాన్ని ఎంచుకున్నారు. దండుమైలారం నుంచి ఇబ్రహీంపట్నం చేరుకోవచ్చన్న ఉద్దేశంతో.. దండుమల్కాపురం నుంచి కాలిబాటన వెళ్లారు. దండుమైలారం కూడలి నుంచి కొన్ని ప్రైవేటు వాహనాల్లో.. హైదరాబాద్ తరలివెళ్లారు.
- ఇదీ చూడండి: అభివృద్ధే ఆయనకు ఓటు బ్యాంకు!