విజయవాడ మహా నగరంలో శబ్దకాలుష్యం పెరిగినట్లు స్థానిక లయోలా కాలేజీ విద్యార్థులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ప్రధాన రహదారులపై గతేడాదితో పోలిస్తే 20 డెసిబల్స్ అధికంగా నమోదయినట్లు తేలింది. నాలుగు బృందాలు, మూడు నెలల పాటు 23 ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. 60 డెసిబల్స్ తీవ్రత ఉండాల్సిన ప్రాంతాల్లో100 డెసిబల్స్కు పైగా ఉన్నట్లు భౌతిక శాస్త్ర పరిశోధకులు ఆచార్య శ్రీకుమార్ తెలియజేశారు.
ప్రమాణాలకు మించి..
నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో.. ఉదయం 55 డెసిబల్స్ , రాత్రి 45 డెసిబల్స్ ఉండాలి. వాణిజ్య సముదాయాల వద్ద పగలు 65, రాత్రి 55, పారిశ్రామిక వాడల్లో పగలు 75 ,రాత్రి 70 డెసిబల్స్ వరకు ధ్వని తీవ్రత ఉండొచ్చు. అయితే తాజా అధ్యయనంలో ఈ ప్రాంతాల్లో 20 నుంచి 30 డెసిబల్స్ వరకు పెరిగినట్లు వెల్లడైంది.
నిర్మాణాల వల్లే అధిక ధ్వని
ప్రస్తుతం 5లక్షల ద్విచక్ర వాహనాలు,1.5 లక్షల కార్లు, 25 వేల ఆటోలు, 10 వేల లారీలు విజయవాడ జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.దీని కారణంగా శబ్దకాలుష్యం విపరీతంగా పెరుతోందని నివేదికలో పేర్కొన్నారు. విజయవాడ పరిసరాల్లో నూతన నిర్మాణాలు అధికంగా జరుగుతుండటం వల్ల వాతావరణంలోకి దుమ్ము, దూళి కణాలు చేరి శబ్దకాలుష్య తీవ్రత పెరగడానికి కారణమౌతున్నట్లు తెలుస్తోంది. ధ్వని తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.