రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులు గుట్కా దందా, గంజాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లా కంచికచర్లలో..
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ధనలక్ష్మి నగర్ గొట్టుముక్కల గ్రామంలో ఓ వ్యక్తి వద్ద 20 వేల 175 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.85 వేల విలువ చేసే సరకు సహా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కంచికచర్ల పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు ఎస్ఈబీ సీఐ వివరించారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా, అక్రమ మద్యం రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హనుమాన్ జంక్షన్ పరిధిలో
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పరిధిలో భారీగా గుట్కా నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ కె.సతీష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే గుట్కా తదితర ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా నగరం మండలంలో..
గుంటూరు జిల్లా నగరం మండలంలో నిషేధిత గుట్కా అమ్ముతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధూళిపూడి గ్రామంలో ఓ దుకాణంలో గుట్కా, ఖైని ప్యాకెట్లు అమ్ముతున్నారన్నా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 4 వేల 250 నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. వాటి విలువ రూ. 26 వేలు ఉంటుందన్నారు. ఈ క్రమంలో మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. నిరంతరం విస్త్రృత తనిఖీలు చేస్తూనే ఉంటామని.. అసాంఘిక, అనధికార, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
కడప జిల్లా కోడూరులో..
కడప జిల్లా కోడూరులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమాలపై దాడులు జరిపారు. దాడుల్లో ఒక కిలో 800 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కోడూరు పట్టణం జీపీ కాలనీలోని చిట్వేలి బస్టాప్ వద్ద ఎండు గంజాయిని తరలిస్తున్న మనెమ్మను అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రామ్మోహన్, సహా ఎస్ఈబీ సిబ్బంది పాల్గొన్నారు.