Grain Farmers are Suffering Due to YCP Government Negligence: తుపాను వెళ్లినా ధాన్యం రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. తుపాను దాటికి దెబ్బతిన్న రైతులు కొద్దోగొప్పో చేతికి అందిన తడిసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో తేమశాతం పేరుతో రైతుల ఆశలకు గండికొట్టేలా ఆర్బీకే సిబ్బంది, మిల్లర్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. రైతులను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో చిత్తశుద్ధి చూపించడం లేదు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏటా 6 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరిస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం ఇప్పుడిప్పుడే సేకరణ ప్రారంభమవుతుంది. కానీ తేమశాతంపై రెండు జిల్లాల్లోనూ మిల్లర్లు ఒకే రకమైన వైఖరిని అవలంబిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తేమశాతం ఉన్నప్పటికీ కొంత కొంటున్నా కృష్ణా జిల్లాలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. మిగ్ జాం తుపాను తర్వాత కృష్ణా జిల్లాలో రైతుల నుంచి కొన్న ధాన్యం నామమాత్రమే. కృష్ణా జిల్లాలో 10.50 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా కాగా ఇప్పటివరకు 80 వేల టన్నులు కొన్నారు.
రైతు కష్టాలు పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు : చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లాలో ఉత్పత్తి అంచనా 1.35 మెట్రిక్ టన్నులైతే 6 వేల 500 టన్నులు కొన్నారు. మరోవైపు లారీల సమస్య గోనె సంచుల కొరత సమస్య కూడా తోడైంది. రైతు భరోసా కేంద్రాలలో సిబ్బంది వైఖరి సరేసరి. కృష్ణా జిల్లాలో 150 రైస్ మిల్లులున్నాయి. ధాన్యం తేమశాతం 17 శాతం దాటితే ఒక శాతం తేమకు క్వింటాకు కిలో చొప్పున కోత వేస్తున్నారు. దీనికి సిద్ధమై రైతులు విక్రయిస్తుంటే వాటిని కూడా తీసుకోవడానికి నిరాకరిస్తున్న సందర్భాలున్నాయి. రైతులు ఎంతో కొంత ధరకు దళారీలకు సరకును తెగనమ్ముకుంటున్నారు.
రైతులకు చేదు మిగిల్చిన మిగ్‌జాం తుపాను-తడిసిన ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపని మిల్లర్లు
రెండు జిల్లాల్లో వరి రైతులకు ఎక్కువగా వ్యాపారులే పెట్టుబడులు పెడుతున్నారు. వారికి రైతులు ధాన్యం అమ్ముతుంటే బస్తాకు 300 రూపాయల వరకు కోత వేస్తున్నారు. దళారీలు చెబితేనే ఆర్బీకేల్లో గన్నీ సంచులు ఇస్తున్నారు. వారి సూచనల మేరకు ధాన్యాన్ని కొంటున్నారు. కృష్ణా జిల్లాలో 150 రైస్ మిల్లులకు గాను 45 చోట్ల డ్రయ్యర్లున్నాయి. వీటిలోనే ఆరబెట్టి మిల్లు ఆడిస్తారు. మిగిలిన వాటిలో తేమ ఎక్కువ ఉన్న ధాన్యానికి బియ్యం దిగుబడి తక్కువ వస్తుందని చెబుతున్నారు. 25 నుంచి 27 శాతం తేమ ఉన్నా కొనాలని ప్రభుత్వం ఆదేశించినా కిందిస్థాయిలో అమలు కావడం లేదు.
మిగ్‌జాం తుపానుతో డీలా పడ్డ రైతన్న- పరిహారమన్నా ఇయ్యన్నా జగనన్న!
తేమ శాతం ఎక్కువైనా గత ప్రభుత్వం తీసుకుందని, వెంటనే డబ్బులిచ్చేవారని రైతులు గుర్తు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్తే ధాన్యం కొనకుండా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్బీకేలు, మిల్లర్లు తమతో ఆడుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ఇళ్లలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సాగు చేశామని తీరా అమ్ముకుందామంటే అడ్డంకులు పెడుతున్నారని అన్నదాతలు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. తేమశాతం పట్టింపు లేకుండా ప్రతి గింజ కొంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.