ప్రైవేటు వ్యక్తుల నుండి భూసేకరణ చేసిన భూములు మాకొద్దు అంటూ ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామ పంచాయతీలో 166 మంది ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలకు లబ్ధిదారులుగా ఎంపిక అయ్యారు. గ్రామానికి అనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
ఊరికి 4 కిలో మీటర్ల దూరంలో రైల్వే ట్రాక్, స్మశానవాటిక పక్కన ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని తీసుకొని ఆ స్థలం ఇవ్వడాన్ని లబ్ధిదారులు వ్యతిరేకిస్తున్నారు. తమకు అక్కడ సరైన సదుపాయాలు లేవని చెప్తున్నారు. మంచినీటి వసతి, విద్యుత్ సదుపాయాలు లేవని.. అక్కడ స్థలం ఇచ్చినా నిరుపయోగంగా ఉంటుందని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో తమకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. అధికారులు స్పందించి భూ సమీకరణ చేసిన ప్రైవేటు భూమి కాకుండా.. గ్రామానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి ఇవ్వాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: దేశంలో 7 వేలు దాటిన కరోనా మరణాలు