Sajjala Ramakrishna Reddy : వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ తీరును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. సీబీఐ విచారణ పేరిట డ్రామా జరుగుతోందని ఆరోపించారు. హత్య జరిగిన వెంటనే సిట్ విచారించిన రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా సీబీఐ విచారణ జరపడం సరైంది కాదన్నారు. సీబీఐ విచారణలో కిందిస్థాయి అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, టీడీపీ నేతలు, చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే సీబీఐ కింది స్థాయి అధికారులు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
బీజేపీ కోవర్టుల సహకారంతో...: బీజేపీలో కోవర్టులుగా ఉన్న తన మనుషుల ద్వారా.. సీబీఐ విచారణను చంద్రబాబు ప్రభావితం చేయిస్తున్నారని ఆక్షేపించారు. జగన్ వ్యక్తిత్వాన్ని చెడ్డగా చూపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వాంగ్మూలాలను మార్చి, చెప్పినవీ, చెప్పనివీ రాయించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డే అవినాష్ రెడ్డికి ముందుగా ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. వివేకా ఫోన్ లోని కాల్ డేటాను ఎందుకు డిలీట్ చేశారో తెలియాల్సి ఉందన్నారు.
కుటుంబ కలహాలు కూడా కారణమే.. రెండో పెళ్లి విషయమూ వివేకా హత్యకు కారణమై ఉండొవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయని, వివేకా కుటుంబమంతా ఒక్కటై ఆయన చెక్ పవర్ తీసేశారన్నారు. రెండో పెళ్లి హత్యకు ఎందుకు కారణం కాకూడదనే కోణంలో ఎందుకు విచారించడం లేదని సజ్జల ప్రశ్నించారు. రాజకీయంగా టీడీపీ నేతలు, లేదా కుటుంబం కలహాల కుట్ర కోణంలో ఎందుకు చూడటం లేదని ప్రశ్నించారు. హత్యకు రెండు మూడు రోజుల ముందు.. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి ఏం చేశారో సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. బెయిల్ విషయంలో సీబీఐ అఫిడవిట్లో రాసినవి చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
తప్పుడు ప్రచారం... వివేకా హత్య కేసులో తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ వైపు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందన్న సజ్జల... సీబీఐ విచారణ తీరుపై తాము సరైన సమయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వివేకా హత్య కేసులో సిట్ రిపోర్టును బయటపెట్టడం లేదని, బయటపెడితే ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. హంతకుడు అప్రూవర్‌గా మారడమే తప్పని, అప్రూవర్‌గా మారిన హంతకుడు చెప్పినవాటిని పూర్తి ఆధారంగా తీసుకోకూడదని చట్టం చెబుతోందన్నారు. వివేకా రెండో పెళ్లి విషయం, వివాదాన్ని సీబీఐ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి :