రాష్ట్ర విభజన అనంతరం భూముల ధరలకు రెక్కలు రావడంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు సైతం నకిలీ దస్తావేజులు పుట్టించి భూ దందాలకు తెరతీస్తున్నారు. చెన్నై-కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న భూములే లక్ష్యంగా జరుగుతున్న దందాలు, ఆక్రమణలు అధికారులు, నేతలు స్థిరాస్తి పెంపు, వసూళ్లకు ఉపయోగించుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థిరాస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ దస్తావేజులు హక్కుదారుడి వద్ద ఉంటే.. ఆన్లైన్లో మరో వ్యక్తి పేరు చూపించడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ పోరంబోకు స్థలాలు, రోడ్లు పూర్తిగా కబ్జాకి గురై భవనాలు, హోటళ్లు నిర్మించుకొని కబ్జాదారులు తమ వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి విమానాశ్రయ ప్రహరీకి ఆనుకోని, ప్రభుత్వ స్థలాల్లో చేపడుతున్న అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు, కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలతో ఫిర్యాదులు చేసినా కనీస చర్యలు తీసుకోకపోవడం లేదని పలువురు వాపోయారు. తమ భూములకు రక్షణ కల్పించి.. రీసర్వే ద్వారా ఆక్రమణలు తొలగించి సీఆర్డీఏ నిబంధనల ప్రకారం రహదారులు నిర్మించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు నిర్మాతల ఆనందం