కృష్ణా జిల్లాలో పంటనష్టం రూ.కోట్లలో ఉంటుందని అధికారుల అంచనా. వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా కొంత అంచనా వేసినా నష్టం పూర్తి వివరాలు ఇప్పుడే తెలియవని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 3.16లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంచుమించు సుంకు దశలో ఉన్నాయి. వర్షం వల్ల సుంకులో నీరు చేరి.. గింజ తాలుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు మాత్రం పూర్తిగా నీట మునిగిన వరి పొలాలను మాత్రం నష్టం అంచనా వేస్తున్నారు. జిల్లాలో పత్తి 1.3లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మెట్ట ప్రాంతాల్లోని మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఉంది. పూత పిందె, కాయ దశలో ఉండడం వల్ల దాదాపు 50 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో మిర్చి సాగు చేశారు. 30వేల ఎకరాల్లో ఉంది. మొక్కలు నాటడం వల్ల వర్షాలకు చనిపోతున్నాయి. తిరిగి నాటేందుకు నారు లభించడం లేదు. ఒక మొక్క రూ.3 నుంచి రూ.5కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మెట్ట ప్రాంతంలోనే మొక్కజొన్న 50వేల ఎకరాల్లో సాగు చేశారు. కంకులు వస్తున్నాయి. ఈదురుగాలులకు నేల మట్టం అయ్యాయి. డెల్టా ప్రాంతంలో పసుపు, అరటి తోటలు నేల కూలాయి. జిల్లాలో అంతంతమాత్రంగా ఉన్న కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది.
అనాసాగరం వద్ద నీట మునిగిన మొక్కజొన్న పంటను చూపుతున్న రైతు కంచి కృష్ణ
నివాసాల్లోకి నీరు..!
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు విజయవాడ నగరం, జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం, గుడివాడ, తదితర పట్టణాల్లో పలుకాలనీలు జలమయమయ్యాయి. కృష్ణా వరదతో విజయవాడ నగరంలోని కృష్ణలంక, యనమలకుదరు ప్రాంతాలు, పెదపులిపాక, లంక గ్రామాల్లోకి నీరు చేరింది. విజయవాడ నగరం విద్యాధరపురంలో ఇల్లు కూలి ఒకరు మృతి చెందగా, కొండ చరియలు విరిగిపడి మంగళవారం ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏనుగుగడ్డవాగులో ఒకరు గల్లంతయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వానలకు 18 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. 53 పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఇంకా 11 ఇళ్లు 24 గంటలుగా నీటమునిగి ఉన్నాయి. నది వరద తాకిడితో పలు కాలనీలు జలమయమయ్యాయి. విజయవాడ నగరంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వాసితులను తరలించారు.
కృష్ణలంకలోని తారకరామానగర్‌లోకి నీళ్లు చేరాయి. అక్కడి వారు తమ సామాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించుకుంటున్నారిలా....
మొక్కజొన్న.. ఉపయోగం ఉందా ఏమన్నా?
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద వర్షానికి మొక్కజొన్నకు బూజు పట్టిందిలా..
జలదారి
ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు-కాచవరం రహదారి మీదుగా వరద నీరు ప్రవహించడంతో పెద్ద చెరువును తలపించింది
గంగమ్మ ఉరక... జంగమయ్యకు ఎరుక!
వరద సమయాల్లో కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెం శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. చుట్టు పక్కల ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని అంచనా వేయడానికి అధికారులు ఈ ఆలయం వద్దకు చేరే ప్రవాహాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. లక్ష క్యూసెక్కులైతే శివాలయానికి 500 మీటర్ల దూరం, 2 లక్షలకు 200 మీటర్లు, 3 లక్షలకు గుడి ప్రహరీ వరకు, 4 లక్షలకు గోపురం అడుగు భాగం వరకు(చిత్రంలో ఉన్న విధంగా), 5 లక్షలకు గోపురం మునక, ఐదున్నర లక్షలకు ధ్వజస్తంభం, ఆరు లక్షలకు పూర్తిగా కనపడకుండా వరద నీరు ఆలయాన్ని ముంచేస్తుంది. ప్రవాహ మట్టం గంటకు ఎంత పెరుగుతుందో కూడా శివాలయం వద్దకు చేరే నీటిని బట్టి అంచనా వేస్తుంటారు. అందుకే వరద సమయంలో దీనికి ప్రత్యేకత ఏర్పడింది.
రహదారులు ఛిద్రం..!
నూజివీడు సిద్ధార్థనగర్ వద్ద రెడ్డిగూడెం వెళ్లే రహదారి ఇలా ధ్వంసమైంది.
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో రహదారులు ధ్వంసం అయ్యాయి. తారు రోడ్లు మరీ దెబ్బతిన్నాయి. ర.భ. లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు తాత్కాలిక మరమ్మతులకే రూ.20.37 కోట్ల అవసరం ఉంది. శాశ్వత ప్రాతిపదికన రూ.195 కోట్లు అవసరమని అంచనా వేశారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారులు 3,550 కి.మీ ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు సుమారు 419 కిలోమీటర్లు. వాగులు వంకలు ఉద్ధృతంగా రహదార్లపై ప్రవహించడంతో జిల్లాలోని ఏడు చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. గంపలగూడెం-నూజివీడు, తిరువూరు-అక్కపాలెం, విస్సన్నపేట-లక్ష్మిపురం, తిరువూరు-రాజవరం మధ్య రోడ్లు తెగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 29 కల్వర్టులు ధ్వంసం అయ్యాయి. వీటికి తాత్కాలికంగా మరమ్మతులు చేయడానికి రూ. 2,037 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. శాశ్వత ప్రాతిపదికన పనులు నిర్వహించడానికి రూ.195 కోట్ల ఖర్చు కానుంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు వాలిపోయాయి. వాటిని వెంటనే మరమ్మతులు చేశారు. నామమాత్రంగానే నష్టం ఉందని అంచనా వేశారు.
జి.కొండూరు మండలం సున్నంపాడు సమీపంలో పులివాగుపై నిర్మించిన చప్టా వద్ద కోతకు గురైన కేజీవై రోడ్డు
వర్షాలకు దెబ్బతిన్న గొల్లపూడి బైపాస్ రోడ్డు
పొలాల్లో చేపల వేట
నందిగామ మండలం దాములూరులో వైరా, కట్టలేరు వరదనీటితో వరిపొలాలు మునిగి చెరువులా మారాయి.
ఈ వరద నీటిలో ఓ జాలరి వల వేస్తూ చేపలు పడతూ కనిపించాడు.
కుంపెనీ వాగు ఉద్ధృతం
ఆగిరిపల్లి మండలం తోటపల్లి దగ్గర నూజివీడు-గన్నవరం రహదారిలో పరిస్థితి ఇదీ...
ఇదీ చదవండి: రాష్ట్రంలో 71,821 హెక్టార్లలో పంట నష్టం: వ్యవసాయశాఖ