కృష్ణానది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. దీనివల్ల బ్యారేజీకి సమీపంలోని కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్, రణదేవ్ నగర్, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. కొన్నిచోట్ల ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తాత్కాలికంగా పరదాలు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. పిల్లలతో కలిసి రాత్రంతా దోమల మధ్యే ఉంటున్నామని... తిండిలేక పస్తులుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో అధికారులు తాత్కాలిక పునరావాసం కల్పించినా.. ఇంట్లో సామాన్లు పోతాయనే భయంతో అక్కడినుంచి వెళ్లేందుకు స్థానికులు నిరాకరిస్తున్నారు.
కట్టుబట్టలతో...
వరద వచ్చిన ప్రతిసారి ఇలా కట్టుబట్టలతో సామాన్లు నెత్తిన పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. వరద తగ్గేవరకు పనులు మానుకోవలసి వస్తుందంటున్నారు. తమకు కొత్తగా ఇళ్లు అవసరం లేదని... కరకట్టను పొడిగించి బ్యారేజీ వరకు గోడ నిర్మిస్తే సరిపోతుందని వేడుకుంటున్నారు.
అందని సాయం
గతంలో రెండుసార్లు వరద వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇంతవరకు తమకు అందలేదని బాధితులు వాపోతున్నారు. ఈసారైనా సాయం అందించాలని కోరుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పుడిప్పుడే వరద ముంపు తగ్గుతుండటంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.