కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద పెనుగంచిప్రోలు మండలం శనగపాడు వెళ్లే ప్రధాన రోడ్డుపై పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సంబంధిత అధికారులు ఎవరూ అక్కడ రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో.. ఆ వాగు పైనుంచే ప్రజలు దాటుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే...ఎలా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వారు కోరుతున్నారు.
జగ్గయ్యపేట మండలంలో మున్నేరులో వరద ఉధృతి భారీగా పెరిగింది. ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెన నీట మునిగింది. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్టకు 17 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. తెలంగాణకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పెనుగంచిప్రోలు వద్ద వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 12.5 అడుగుల నీటి మట్టం నమోదయ్యింది. 50 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది.
వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద కట్టలేరు వాగు వరద నీరు.. దేవినేని వెంకట రమణ వారధిపై ప్రవహిస్తుంది. దీంతో అటువైపు వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో వైరా - కట్టలేరు వాగు వరద ప్రవాహంలో మామిడితోటలో కొంతమంది కాపలా దారులు చిక్కుకున్నట్లు సమాచారం. నందిగామ మండలం దాములూరు వద్ద ఆర్అండ్బీ రహదారిపై నుంచి వైరా కట్టలేరు వాగు వరద ప్రవహిస్తుంది. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి.
పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు - గుమ్మడిదుర్రు మధ్య కూటివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వెయ్యి ఎకరాలకు పైగా వరి నీట మునిగింది. తమ్మిలేరుకు వరద ఉద్ధృతి పెరిగింది. 2,500 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో పరిసర ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయి.
ఇదీ చూడండి. Reservoirs: నిండుకుండలా జలాశయాలు..నీటిమట్టం ఎంతంటే..