Farmers Problems due to Crop Loss: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో మిగ్‌జాం తుపాను నిండా ముంచిందని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం చాగంటిపాడు, నందమూరు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావంతో కోసిన వరి పనలు నీళ్లలో నానడంతో ధాన్యం పూర్తిగా మొలకొచ్చిందని వాపోయారు.
ఏటా ఇదే పరిస్థితి నెలకొనడంతో వ్యవసాయానికి చేసిన అప్పు తీరడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తుపాను తీరం దాటి పది రోజులు కావస్తున్నా నేటికీ తమను పట్టించుకున్న అధికారి కానరాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సాగుచేస్తున్న సుమారు 15 ఎకరాల వరి కుప్పలను దున్నాల్సిన పరిస్థితి నెలకొందని బోరున విలపిస్తున్నారు.
పంటల బీమాపై రైతన్నల ఆశలు - పరిహారాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వం
ఎకరాకు 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని, రెండో పంటగా కోతకు ముందే 15 వేల రూపాయలు వెచ్చించి మినుమును చల్లినట్లు అన్నదాతలు తెలిపారు. 1318 రకం విత్తనం వేస్తే ఈ ఏడాది ఎకరాకు 40 బస్తాలు పండిందని, ఆ విధంగా చూసుకుంటే ఎకరాకు రూ.లక్షన్నర చొప్పున మొత్తం 22 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు.
పరిహారం అందజేయాలి: తమను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం నష్ట పరిహారం అందజేయాలని కోరారు. కోసిన వరి కుప్పల్లోని ధాన్యానికి మొలకలు రావడంతో కౌలు రైతులు పెద్దిరెడ్డి నారాయణరావు, ముత్యాల వెంకటేశ్వరరావు, రాజా తదితరులకు చెందిన పదిహేను ఎకరాల కోత కోసిన వరి పొలాన్ని దున్నేశారు.
గన్నవరం మండలం ముస్తాబాద రైల్వేగేట్ సమీపంలోని పొలాలు నేటికీ నీటిలోనే దర్శనమిస్తున్నాయి. మిగ్‌జాం తుపానుతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, స్థానికంగా రైల్వే పనుల నిమిత్తం తీసిన గోతుల కారణంగా నీరు దిగువకు పోయేందుకు సరైన మార్గం లేదని రైతులు తెలిపారు. దీంతో వరదంతా పొలాల్లోనే నిలిచి పోయింది. దీని కారణంగా నీటిని తోడేందుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సత్వరమే ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి పొలాల్లోని వరద దిగువకు పోయేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మిగ్‌జాం తుపానుతో డీలా పడ్డ రైతన్న- పరిహారమన్నా ఇయ్యన్నా జగనన్న!
"మేము ఇక్కడ 15 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పటి వరకూ ఎకరాకు 30 వేలు అయింది. ఈ తుపాను కారణంగా పంట మొత్తం నీటిలోనే ఉంది. కాలువలు పూడికపోయి ఉండటం వలన నీరు వెళ్లడం లేదు. ఇంట్లో ఉన్న బంగారం అమ్మి పంట కోసం పెట్టినాం. మినుములు కూడా వేసినాము. ఇప్పటి వరకూ ఏ అధికారి మా వద్దకు రాలేదు". - రైతు
"పంట మొత్తం నీట్లోనే ఉంది. గతంలో కోతకు ముందు మినుములు వేశాము. అవి కూడా ఇప్పుడు పోయాయి. మరోసారి ఇప్పుడు కొనాలి. ఇప్పటికే మాకు ఆరు లక్షల రూపాయల ఖర్చు అయింది". - రైతు