వ్యవసాయానికి ఆధారమైన విద్యుత్, విత్తనాలు - ఎరువులు, రుణ సహాయం, మార్కెటింగ్ వంటి నాలుగు స్తంభాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని.. రైతు సంఘాలు ఆరోపించాయి. ఉచిత విద్యుత్ పథకం సంస్కరణలపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
రాష్ట్ర ఆర్ధిక స్థితి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని.. ప్రతిరోజు అప్పు తెచ్చుకుంటే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విజయవాడలో అన్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఋణ పరిమితి పెంపు, విద్యుత్ సంస్కరణలకు ముడిపెట్టడం దుర్మార్గమన్నారు. ఉచిత విద్యుత్ పై ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పే మాటలు సహేతుకంగా లేవన్నారు. నగదు బదిలితో ఉచిత విద్యుత్ పథకం ఆచరణలో సాధ్యం కాదని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకంపై మంత్రివర్గం ఆమోదాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో మోదీ ఆడిస్తుంటే రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆడుతుందని కౌలు రైతు సంఘం నాయకులు కేశవరావు అన్నారు. రైతుల ఖాతా వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో పనేముందని.. ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు చెల్లింపు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగమే అన్నారు. 6 నెలలు బిల్లులు కట్టకపోయినా కనెక్షన్లు కట్ చేయబోమని చెప్తున్నా.. ఇది ఆచరణలో సాధ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అవసరం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని రైతు సంఘాలతో త్వరలో సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: