విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామ పరిధిలోని సుమారు మూడువేల మంది పైగా పేదలకు పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాలకు వెళ్లే దారిలో గత వారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారికి గండి పడింది. దీనివల్ల పొలం పనులకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయవాడ, నున్న, పాతపాడు తదితర ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ భారీగా భూములు కొనుగోలు చేసింది. మొక్కుబడిగా ప్లాట్లను అభివృద్ధి చేసిన అధికారులు.. ప్రధాన రహదారిపై వాగు ప్రవాహాన్ని అంచనా వేయకుండా తూతూ మంత్రంగా తూములు వేసి చేతులు దులుపుకొన్నారు. అయితే వారం రోజుల క్రితం పడిన భారీ వర్షానికి చీమల వాగులో వరద ఉద్ధృతికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. మరమ్మతులు చేయాలంటే భారీగా నిధులు ఖర్చయ్యే అవకాశం ఉండటంతో రెవెన్యూ అధికారులు అటు వైపు రావడానికి సంశయిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం చేయాలని స్థానికులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
చీరాలలో ఏదో చేద్దామని అనుకుంటే పొరపాటే... పోలీసులకు వైకాపా నేత హెచ్చరిక