అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు లక్షా యాభై వేల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. సుమారు 20 వేల ఎకరాల్లో మెట్టపంటలు పండిస్తున్నారు. మొక్కజొన్న, మామిడి, చెరకు, జామ, పసుపు, అరటి, కంద, బొప్పాయి, టమాటా, మిర్చి, వంగ, బెండ, కాకర, బీర, సొర, క్యారెట్, చిలకడదుంప మొదలైనవి సాగు చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కేఇబీ కాలువ ద్వారా సాగునీరు వస్తేనే ఈ పంటలు సాగవుతాయి.
కృష్ణానదికి అధిక వరదలు వస్తే.. ముంపునకు గురై నష్టపోతున్నారిక్కడి రైతులు. అడవిపందులు, కోతులు దీనికి తోడవుతున్నాయి. మిర్చి పంట ఎక్కువగా పండినా... కేజీకి రూపాయి రాక కృష్ణానదిలో పారబోస్తున్నారు. నిల్వ చేసుకోనే సౌకర్యం లేక నష్టపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు లభించక ఇబ్బందులు పడుతున్నారు.
దివిసీమలో అప్పుల బాధ, పాముకాట్లు, విద్యుదాఘాతం, పిడుగులుపడి చాలా మంది రైతులు ఏటా చనిపోతున్నారు. కష్టపడి కాలానికి ఎదురీది... పంటలు పండిస్తే దళారులు దోచుకుంటున్నారు. రైతులు కూలీగా మిగులుతుంటే దళారులు లక్షాధికారులు అవుతున్నారు.
పంటల విషయంలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ అక్కరకు రావడం లేదు. సిబ్బంది కొరతతో ఆ శాఖ సతమతమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అన్నంపెట్టే అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: