వరి పంటకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని దిగుబడి ఆధారంగా బీమా పథకాన్ని వర్తింప చేయాలని నిబంధన విధించారు. ఇటీవల వరకు ఐదేళ్ల దిగుబడులను ఆధారంగా బీమా వర్తింప చేస్తామని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఏడేళ్ల దిగుబడిని ప్రామాణికంగా పంటకోత ప్రయోగాల ద్వారా దిగుబడులను పరిశీలించి అర్హులైన వారికి బీమా సాయాన్ని అందిస్తామని చెప్పడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
- ఈ-పంటలో నమోదైన పొలాలకు మాత్రమే బీమా వర్తించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ-పంటలో నమోదు కానిపొలాలు కూడా ఉన్నాయి. బందరు, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను ఇలా జిల్లాలోని ఆయా మండలాల్లో ఎక్కువశాతం కౌలురైతులు ఉన్నారు. ఈ-పంటలో భూ యజమానుల పేర్లు నమోదై ఉన్నాయి.
- జిల్లాలో సాగైన వరి విస్తీర్ణం: 2.48 లక్షల హెక్టార్లు
- ఈపంటలో నమోదైన రైతులు: 3.39లక్షల మంది
- జిల్లాలో నష్టపోయిన పంటల విస్తీర్ణం: 95,313 హెక్టార్లు
- పంట నష్టపోయిన మండలాలు: 46 గ్రామాలు: 545
ఇచ్చేది ఏదైనా ఒకటే
తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా 95వేల హెక్టార్లకుపైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనికి అనుగుణంగా నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం దెబ్బతిన్న పంటలో 33శాతంపైన నష్టం వాటిల్లితే పరిగణనలోకి తీసుకుంటామని వ్యవసాయశాఖ సిబ్బంది చెబుతున్నారు. బందరు మండలంలోని చిన్నాపురం, తాళ్లపాలెం, పెదపట్నం, కానూరు, గుండుపాలెం, సుల్తానగరం తదితర గ్రామాల్లో ఎక్కువశాతం పంట నేలవాలిపోయింది. కొన్ని ప్రాంతాల్లో పైకి బాగానే కనిపిస్తున్నా లోపల అంత కుళ్లిపోయింది. ఎక్కువశాతం మంది బీపీటీ సాగు చేయడంతో మొలకలు వచ్చేస్తున్నాయి. అంచనాల్లో మాత్రం తక్కువ విస్తీర్ణం చూపించారని రైతులు వాపోతున్నారు.
బీమా వర్తింప చేసే క్రమంలో పనలపై ఉన్న పంటను వ్యవసాయ సహాయకులు చిత్రాలు తీసి నమోదు చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కొందరివి మాత్రమే నమోదు చేశారు. ప్రస్తుతం నమోదు చేయడానికి కూడా గడువు లేదు. ఖరీఫ్ ప్రారంభం నుంచి విడతల వారీగా వర్షాలు కురవడంతో పంట నష్టపోవడంతో పలువురికి పెట్టుబడి రాయితీ ఇచ్చారు. అధికారులు ఒక సర్వే నెంబరు పొలంలో పెట్టుబడి రాయితీ లేదంటే బీమా వీటిలో ఏదో ఒకటి వస్తుందని అంటున్నారు. చాలామంది బీమా పొందడానికి అర్హత కోల్పోయే అవకాశం ఉంది.
2018 డిసెంబరులో వచ్చిన తుపాను వల్ల వరితోపాటు ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బీమా పథకం వర్తింప చేయడంలో అధికారులు తీసుకున్న చర్యల వల్ల రైతులు అనేక అవస్థలు పడ్డారు. నష్టపోయిన పంటతో అన్నదాతల చిత్రాలు తీసి పంపించాలని చెప్పడంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేక కార్యాలయాల చుట్టూ తిరిగారు.
అర్హులందరికీ సాయం
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన రైతులందరికీ సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పంటనష్టం నివేదికను సిద్ధంచేశాం. అన్నదాతల వివరాలు కూడా సేకరిస్తున్నాం. రెండు రోజుల్లో ఆ వివరాలు కూడా పూర్తిస్థాయిలో సేకరించడానికి కృషి చేస్తున్నాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంటనష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పెట్టుబడి రాయితీ పొందిన వారికి బీమా వర్తించదు. ఒక పొలానికి ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. - మోహన్‌రావు,వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు
ఇదీ చదవండి: మళ్లీ కేంద్ర జలసంఘం పరిశీలనకు పోలవరం ఖర్చు