కృష్ణా జిల్లా నూజివీడులో నకిలీ ఐఏఎస్ అధికారి హల్ చల్ చేసింది. తాను రిటైర్డ్ ఐఏఎస్ కె.సుజాతారావుని అంటూ ఓ ఆస్పత్రిలో డబ్బులు గుంజడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఆరోగ్య కమిటీ సభ్యురాలిని అని చెప్పుకుంటూ.. తిరుపతి వెళ్తున్నానని మార్గమధ్యలో ఆసుపత్రి డాక్టర్ దుట్టా రవిశంకర్ పేరుమీద గరుడ పూజ చేపిస్తానంటూ సిబ్బందిని రూ.3,500 నగదు అడిగింది. మహిళపై అనుమానం వచ్చిన సిబ్బంది రవిశంకర్ ని ఫోన్లో మాట్లాడించాలని అడిగారు.
ఈలోపు అసలు విషయం బయటకు వస్తుందనుకున్న మహిళ అక్కడి నుంచి ఉడాయించింది. ఆస్పత్రి సిబ్బంది హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమెను గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పెమ్మడి విజయలక్ష్మిగా గుర్తించినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
ఈ విషయంపై... అసలు రిటైర్డ్ ఐఏఎస్ కె.సుజాతారావు స్పందించారు. తన పేరు చెప్పి నందిగామ, విజయవాడ, హైదరాబాద్ ఇతర ప్రదేశాల్లో పలువురు మహిళలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
ఇదీ చదవండి: