మంత్రి పేర్ని నాని తన వెనుక ఉన్నారన్న ధైర్యంతోనే.. ఆయన అనుచరుడు బందరులో పద్మజ అనే దళిత మహిళను దారుణంగా హత్య చేశారని తెదేపా నేత జవహర్ ఆరోపించారు. తన అనుచరుడు హత్య చేసి ఆధారాలతో పట్టుబడితే.. మంత్రి పేర్ని నాని ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. మంత్రులు ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలే కానీ...రౌడీ షీటర్లు, నేరస్తులతో ఏం పని అని నిలదీశారు. తక్షణమే మంత్రి పేర్ని నాని రాజీనామా చేయాలనీ.. లేదా సీఎం జగన్ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
వైకాపా 16 నెలల పాలనలో దళితులపై దాడులు జరగని రోజులు లేవన్నారు. దళితుల ఇళ్లు తగలబెట్టడం, సజీవ దహనానికి ప్రయత్నించటం, శిరోముండనాలు, దళిత బిడ్డలపై గ్యాంగ్ రేప్‌లు ఇలా దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.. బాధితులపైనే తిరిగి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు అరికట్టేందుకు తీసుకవచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం నీరుగారుస్తోందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'సుబాబుల్ రైతులకు మద్దతు ధర కల్పించండి'