కృష్ణాజిల్లా వీరులపాడు మండలంలో తుపాను వల్ల దెబ్బతిన్న మిర్చి, వరి పొలాలను.. మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. పంట కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొన్న ధాన్యానికీ డబ్బు చెల్లించలేదని ఆరోపించారు. ఈరోజు వరకు ముఖ్యమంత్రి నోట.. రైతుకు సాయం చేస్తామనే మాట రాలేదని దుయ్యబట్టారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి.. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వేలకోట్ల అప్పు కోసం అన్నదాత మెడకు ఉరి తాడు వేయడం దారుణమన్నారు.
సీఎం జగన్ 18 నెలల పాలనలో.. వ్యవస్థలన్నిటినీ కుప్పకూల్చేశారని ఉమ విమర్శించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి బూతులు మినహా ఏమీ మాట్లాడరని ధ్వజమెత్తారు. గతేడాదితో పాటు తాజా పంట నష్టమూ రైతుల ఖాతాల్లో జమ కాలేదని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి.. పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'వ్యవసాయ, విద్యుత్ చట్టాలు ఉపసంహరించుకునే దాకా ఉద్యమిస్తాం'