భారతదేశంలో కొందరికే లభించే అంతర్జాతీయ స్థాయి యూరోపియన్ యూనియన్ ఫెలోషిప్ స్కాలర్షిప్ను గుంటూరుకి చెందిన షేక్ సుల్తానా సొంతం చేసుకున్నారు. గుంటూరులోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి వరకూ చదివిన సుల్తానా... కృష్ణా జిల్లా నూజువీడు త్రిబుల్ ఐటీలో విద్యను అభ్యసించారు.
ఏడాదికి రూ.20 లక్షలు...
షేక్ సుల్తానాకు ఇకనుంచి ప్రతిఏటా రూ.20 లక్షల స్కాలర్షిప్ లభించనుంది. ఈ సొమ్ముతో మొదటి సంవత్సరం ఎం.ఎస్. గ్రీన్ బెల్ విశ్వవిద్యాలయంలో... రెండో సంవత్సరం జర్మనీలోని యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తానని తెలిపారు సుల్తానా.
"నూజివీడు ట్రిపుల్" సహకారంతో...
తనకు స్కాలర్షిప్ రావటంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల కృషి మరువలేనిదని షేక్ సుల్తానా చెప్పారు. ఆ కాలేజీ డైరెక్టర్ సూరి చందర్రావుతోపాటు ఫ్యాకల్టీ విశేషంగా కృషి చేశారని తెలిపారు. తమ కుమార్తెకు అరుదైన గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు మీర్ బాషా(ఆర్మీ ఆఫీసర్), ఎస్ఎన్ సుల్తానా తెలిపారు.
అన్న అజ్మన్ స్ఫూర్తితో విద్యలో రాణిస్తున్నానని చెబుతున్న సుల్తానా... భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం.