Eluru Range DIG on Gudivada incident: గుడివాడ ఘటనపై ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజనిర్ధరణ కమిటీ నుంచి ఆరుగురు తెదేపా నేతలే వస్తామన్నారని.. కానీ వందల మంది వచ్చారని చెప్పారు. ఎక్కువ మంది వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడారని పేర్కొన్నారు. తెదేపా నేతలు ఉద్రిక్త వాతావరణం సృష్టించారని వివరించారు.
"గుడివాడ ఘటన ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతోనే వచ్చినట్లు భావిస్తున్నాం. మేం కావాలని ఎవరినీ అడ్డుకోలేదు. శాంతిభద్రతల్లో భాగంగానే కొందరిని నియంత్రించాం. రెచ్చగొట్టేలా మాట్లాడటం, కేకలు వేయడం తప్పు. ఏం జరిగింది, ఎవరు రెచ్చగొట్టారనేది దర్యాప్తు చేస్తున్నాం" - మోహన్‌రావు, ఏలూరు రేంజ్ డీఐజీ
గుడివాడలో ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే..?
కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారనే అంశంపై తెదేపా నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులుగా ఉన్న తెదేపా సీనియర్ నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమా, వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు గుడివాడ చేరుకున్నారు. తొలుత తెదేపా కార్యాలయానికి చేరుకున్న నేతలు.. అక్కడి నుంచి క్యాసినో నిర్వహించిన ప్రాంతానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. కన్వెన్షన్ సెంటర్ పరిశీలనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకు దిగిన తెదేపా నేతలు బొండా ఉమ, ఆలపాటి రాజా, వర్ల రామయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఇదే సమయంలో తెదేపా నేత బొండా ఉమకు చెందిన కారు అద్దాలను కొందరు ధ్వంసం చేశారు. పోలీసుల సహకారంతోనే వైకాపా కార్యకర్తలు కారు అద్దాలను ధ్వంసం చేశారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి:
tdp leaders arrest in gudiwada: గుడివాడలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ap cabinet meeting: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పీఆర్సీ జీవోలకు ఆమోదం