లాక్‌డౌన్‌లో వాహనాల రాకపోకలన్నీ ఆగిపోయినప్పుడు కాలుష్యం తగ్గి ప్రకృతిలో వచ్చిన మార్పులను ప్రత్యక్షంగా చూశాం. అన్‌లాక్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ఎలక్ట్రిక్ వాహన వినియోగం ప్రోత్సహించటంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. తక్కువ నిర్వహణ ఖర్చు, రిజిస్ట్రేషన్ ఫీజు లేని ఈ వాహనాలు మరికొద్దిరోజుల్లో విశాఖ మార్కెట్‌లోనూ సందడి చేయనున్నాయి.
రెండు మూడేళ్లలో విద్యుత్ ద్విచక్రవాహనాలు..
వాహన తయారీ సంస్థలైన హీరో, టీవీఎస్, మహీంద్రా, సహారా ఇప్పటికే విద్యుత్ బైక్‌లు అమ్ముతున్నాయి. ఇప్పటివరకూ 5 శాతం మంది మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు, కాలుష్య రహితం వీటి ప్రత్యేకతలు కాగా... గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. డీజిల్, పెట్రోల్ వాహనాల సగం ధరలోనే ఇవి అందుబాటులో ఉండటం విశేషం. రవాణాశాఖకు రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. వచ్చే ఏడాది నుంచి అన్ని పెట్రోల్ బంక్‌లో విద్యుత్ వాహన ఛార్జ్ కిట్‌లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోబోతున్న నేపథ్యంలో... రాబోయే రెండు మూడేళ్లలో విద్యుత్ ద్విచక్రవాహనాలు సంఖ్య మరింత పెరుగుతుందని అమ్మకందారులు అభిప్రాయపడ్డారు.
ఇదివరకే సిద్ధమయ్యాయి..!
టాటా, హుందయ్ వంటి సంస్థలు... విద్యుత్‌తో నడిచే కార్లను ఇదివరకే సిద్ధం చేశాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 వందల కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేసే సామర్థ్యం వీటి సొంతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తెలంగాణలోనే ఇవి అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే విశాఖలో వీటిని తీసుకొచ్చేందుకు అమ్మకందారులు ప్రయత్నిస్తున్నారు. వినియోగదారులు ... 10 లక్షల రూపాయల లోపు లభించే విద్యుత్‌తో నడిచే వాహనాలనే వినియోగదారులు అడుగుతున్నారని చెబుతున్నారు.
గణనీయంగా పెరుగుతుంది..
రాష్ట్ర రవాణా శాఖ విద్యుత్ వాహనాలను ప్రోత్సాహిస్తోంది. రిజిస్ట్రేషన్ రుసుము ఇదివరకే రద్దు చేయగా... 18 ఏళ్ళ లోపు వారు లైసెన్సు లేకుండానే ద్విచక్రవాహనాలు వినియోగించేలా వెసులుబాటు కల్పించారు. విద్యుత్ పంపిణీ సంస్థ సహకారంతో.. పలుచోట్ల ఛార్జింగ్ పాయింట్లు నెలకొల్పే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రజల్లోనూ సామాజిక స్పృహ పెరగటమేగాక.. ప్రయోజనాలు మెండుగా ఉండటంతో భవిష్యత్తులో విద్యుత్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వాహనరంగ నిపుణులు చెబుతున్నారు.
.
ఇదీ చూడండి. ప్రకటనల కేసు: కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశాలు