రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యత్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. తొలిదశలో 350 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లకు ఆహ్వానించింది.12 ఏళ్ల కాలపరిమితితో ఈ బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచింది. ఇందుకు సంబంధించి నిర్వహించిన ప్రీబిడ్ సమావేశంలో తొమ్మిది కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
మొదట తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖ, కాకినాడ మార్గాల్లో.. విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. గతనెలలో దేశంలోని బస్సు తయారీదారులతో సమావేశం నిర్వహించి వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు..ఈరోజు ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 14లోగా టెక్నికల్ బిడ్లు, నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేస్తారు. ఎలక్ట్రిక్ బస్సులపై నవంబర్ 6న రివర్స్ బిడ్డింగ్‌కు వెళ్లనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.