కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అక్రమాలపై ఈడీ దర్యాప్తు (ENFORCEMENT DIRECTORATE INVESTIGATION ON KARVY SCAM) కొనసాగుతోంది. ప్రస్తుతానికి రూ. 700 కోట్ల విలువైన కార్వీ షేర్లను ఈడీ స్తంభింపజేసింది. మనీలాండరింగ్ చట్టం కింద కార్వీపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సీసీఎస్, సైబరాబాద్‌లో కార్వీపై బ్యాంకులు ఫిర్యాదు చేసినట్టుగా ఈడీ అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కార్వీ సంస్థ బ్యాంకుల నుంచి రూ.2.873 కోట్ల రుణాలు తీసుకుందని పేర్కొన్న ఈడీ.. షేర్ హోల్డర్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్టు తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా కార్వీ సంస్థ రుణం తీసుకుందని స్పష్టం చేసింది. బ్యాంకుల రుణాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు తెలిపింది.
కార్వీ నిర్వాహకుల నిధుల మళ్లింపు అక్రమాలపై ఈడీ లోతుగా ఆరాతీస్తోంది. వినియోగదారుల షేర్లను అక్రమంగా బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రుణంగా తీసుకున్న కోట్ల రూపాయల నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై కూపీ లాగుతోంది. ఇలా సేకరించిన రుణాల మొత్తం రూ.1,200 కోట్లకు పైగానే ఉంటుందని తేలడంతో ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చంచల్గూడ జైల్లో ఉన్న పార్థసారథిని ఇప్పటికే విచారించిన ఈడీ అతడి వద్ద నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఏక కాలంలో కార్వీ కార్యాలయాలపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.
సంబంధిత కథనాలు..