కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్... విద్యుత్ శాఖలో కారు చోదకునిగా పని చేస్తున్నాడు. చిన్నతనంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన సెల్ ఫోన్ రిపేరులో స్వల్పకాలిక కోర్సు పూర్తి చేశాడు. గతంలో పల్సర్ బైక్ వాడే రమేష్... ఖర్చును భరించలేక తన ద్విచక్రవాహనాన్ని విక్రయించి ఈ-బైక్ కొనాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని వద్ద తగినంత నగదు లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. స్వర్ణభారత్ ట్రస్టులో తీసుకున్న కోచింగ్ సాయంతో తానే సొంతంగా ఈ బైక్‌ను రూపొందించాలని ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాడు.
పాడైపోయిన సైకిళ్ల విడి భాగాలు, పాత ఇనుప ఫ్రేములు, సైకిల్ చక్రాలు, బ్యాటరీలు, వాషింగ్ మెషీన్లో వినియోగించే మోటారును వాడి రమేష్ బాబు ఈ-బైక్‌ను తయారు చేశాడు. రోజూ విధులకు వెళ్లి వస్తూనే.. ఖాళీ సమయంలో బైక్‌ని రూపొందించే పనిలో నిమగ్నమయ్యేవాడు. బ్యాటరీ, కంట్రోల్ యూనిట్, కీ-బాక్స్ మినహా... మిగిలినవన్నీ రమేష్ స్థానికంగానే కొనుగోలు చేసి ఈ-బైక్‌ను తయారు చేశాడు.
ప్రత్యేకతలు
ఈ-బైక్ ప్రత్యేకతల విషయానికి వస్తే....కేవలం గంటపాటు చార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం అవలీలగా ప్రయాణించవచ్చు. ఇందులో అమర్చిన కీ బాక్స్ ద్వారా....ఎన్ని పాయింట్లు ఛార్జింగ్ చేశామనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చూసేందుకు సైకిల్ లా అనిపించినా....ఇద్దరిని సునాయాసంగా మోయగలిగే సామర్థ్యం ఈ-బైక్ సొంతం. దాదాపు రెండు నెలల నుంచి రమేష్ ఈ-బైక్ వాడుతున్నాడు. రెండు నెలలుగా బైక్ కోసం ఖర్చు చేసింది కేవలం 160 రూపాయలు మాత్రమే. నెల మొత్తం ఈ-బైక్ ఛార్జింగ్ ఖర్చు 80 నుంచి 100 రూపాయలు దాటకపోవడం విశేషం. అన్ని వర్గాలవారు, ముఖ్యంగా మహిళలకు ఇది చాలా అనువుగా ఉంటుందని రమేశ్ చెబుతున్నాడు. 2 గంటలు ఛార్జింగ్ చేస్తే... 200 కిలోమీటర్ల దూరం ఏకధాటిగా నడిచే స్కూటీ లాంటి వాహనాన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు రమేశ్. ప్రభుత్వం సాయమందిస్తే... ఇలాంటి ఈ-బైకులు మరిన్ని తయారుచేస్తానని చెబుతున్నాడు.