కృష్ణా జిల్లా అవనిగడ్డలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హామీ ఇచ్చారు. దివిసీమ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో దివంగత విలేకరి మట్టా పితాజీ కుటుంబానికి సేకరించిన రూ.6,17,492 లక్షల విరాళాన్ని పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పితాజీ భార్య స్వాతి కుమారికి అందజేశారు.
25 రోజుల వ్యవధిలో..
ఇరవై ఐదు రోజుల వ్వవధిలోనే నియోజకవర్గ పరిధిలో కొవిడ్ విజృంభణతో ఇద్దరు జర్నలిస్టులను కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివిసీమ జర్నలిస్టుల ఆధ్వర్యంలో దివంగత రిపోర్టర్ నంద్యాల శ్రీనివాస్, విలేకరి మట్టా పితాజీ కుటుంబాలకు రూ. 11,73,209 లక్షలు సేకరించడం చాలా గొప్ప విషయమన్నారు. దివిసీమలో పాత్రికేయులు చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శనీయమని ఆయన వివరించారు.
కార్యక్రమంలో అవనిగడ్డ ప్రెస్ క్లబ్ కార్యదర్శి పుట్టి శ్రీనివాసరావు, ఎంపీడీవో కేవి సుబ్బారావు, తహశీల్దారు టి. చంద్రశేఖర నాయుడు, చల్లపల్లి సీఐ శ్రీనివాసరావు, ఆరు మండలాలకు చెందిన పాత్రికేయులు, పితాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.