పోలీసులకు కులాలను ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేయటం సరికాదని డీఐజి పాలరాజు అన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఘటనల్లో కొంతమంది తమను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు. ఆలయాలపై ఇటీవల వరుసగా 44 విగ్రహాల ధ్వంసం ఘటనలు జరగగా ... వాటిలో 29 కేసులను చేధించినట్లు ఆయన వెల్లడించారు. 7 కేసుల్లో అసలు నేరం జరగకుండా తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. 9 ఘటనలపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తులకు రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తేలిందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలను ఆధారాలతో ఇటీవల డీజీపీ తెలిపారని గుర్తుచేశారు.
2014లో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు అగ్రహారంలో విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడిని గతంలోనే జైలుకు పంపామన్నారు. అయితే తాజాగా ఘటన జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని గుర్తుచేశారు. తమిళనాడు, కర్ణాటకలో విగ్రహ ధ్వంసం జరిగితే ఏపీకి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని పాలరాజు వివరించారు. విజయనగరం రామతీర్ధం ఘటనలో విచారణకు పిలిచామని ..వారు రాకపోతే 41 సీఆర్ పీసీ నోటీసు ఇచ్చి విచారించి పంపామని డీఐజీ పాలరాజు గుర్తుచేశారు. అక్రమ అరెస్ట్ చేయలేదన్న ఆయన.... రధయాత్రకు అనుమతిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు.
ధర్మపరిరక్షణ యాత్రకు షరతులతో కూడిన అనుమతి: డీఐజీ రాజశేఖర్
తిరుపతిలో తితిదే చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చామని డీఐజీ రాజశేఖర్ తెలిపారు. బైక్ ర్యాలీలు చేపట్టవద్దని, 100 మంది కంటే ఎక్కువ మంది రాకూడదని నిబంధనలు విధించామన్నారు నిబంధనలు ఉల్లఘించటంతో అనుమతిని రద్దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: