కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ బాధితులకు తెదేపా హయాంలోనే ఆసరా దొరికిందని... ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. మండలంలోని చీమలపాడు ప్రధాన కూడలి వద్ద కిడ్నీ బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగగా.. ఆయన ఈ శిబిరాన్ని సందర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నందున ఏమీ చేయలేకపోయానని చెప్పిన ఎమ్మెల్యే... రక్షణనిధి అధికారంలో ఉన్న మూడేళ్లలో బాధితులకు ఏం న్యాయం చేశారని దేవినేని ఉమ ప్రశ్నించారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ కొండూరు కిడ్నీ బాధితులను గుర్తించి.. నిమ్స్ డైరెక్టర్‌ను ఈ ప్రాంతానికి తీసుకువచ్చి సుమారు 700 మంది నుంచి రక్త నమూనలను స్వీకరించినట్లు గుర్తు చేశారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది కనుక ఆనాడు.. చంద్రబాబు గమనించి వారికి ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించారన్నారు. ట్యాంకర్ల ద్వారా కృష్ణా జలాలను కిడ్నీ బాధిత తండాలకు అందించారని పేర్కొన్నారు. తెలుగుదేశం హయంలో డయాలసిస్ పేషెంట్లకు రూ. 3,000 నుండి 10,000 అందించిందన్నారు.
ఇదీ చదవండి: నిరుద్యోగ యువతను అరెస్టు చేయడం దారుణం: అచ్చెన్నాయుడు