హైదరాబాద్ వనస్థలిపురంలో నవంబర్ 26న విద్యుదాఘాతంతో గుడిసెతో సహా సజీవదహనం అయిన రమేశ్ కేసులో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరికి చెందిన రమేశ్, స్వప్న దంపతులు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చారు. వనస్థలిపురంలోని యస్కేడీనగర్లో ఓ చిన్న గుడిసెలో నివాసమున్నారు. రమేశ్ మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రియుడి మాయలో పడి...
ఉన్నదాంట్లో ప్రేమగా చూసుకునే భర్త... ఇద్దరు పిల్లలను పక్కనబెట్టి... ప్రియుని మాయలో పడింది స్వప్న. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన ప్రియుడు వెంకటయ్య, స్వప్న... ఎవ్వరికీ అనుమానం రాకుండా రమేశ్ అడ్డు తొలగించుకోవాలని పథకం రచించారు. పొలం పనులున్నాయన్న సాకుతో స్వప్న తన పిల్లల్ని వెంటబెట్టుకుని అత్తగారింటికి వెళ్లింది. నవంబర్ 25న రాత్రి గుడిసెలో తిని పడుకున్న రమేశ్‌ని గమనించిన వెంకటయ్య... తెల్లవారుజామున పథకాన్ని అమలు చేశారు. గుడిసెపై పెట్రోల్‌పోసి అంటించాడు. విద్యుదాఘాతంగా చిత్రీకరించి... కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
చంపింది... నటించింది...
ఇదిలా ఉండగా... ఘటన జరిగిన రోజు ఆమె చెప్పిన విషయాలు చూస్తే అంతా హవ్వా... అనాల్సిందే. తనకు ఏమీ తెలియదనీ... ఆడపడచు ఫోన్‌చేసి విషయం చెప్తేనే తెలిసిందని ఆమె ఏడ్చిన ఏడుపు పాపం అనిపించకమానలేదు.
ఎంత పని చేసెరో రాములా...
హత్యకు ముందు రమేశ్... తన భార్య స్వప్నతో సరదాగా టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరించుకున్నాడు. కనికట్టేదో చేసీ రాములో రాములా సుట్టూ తిప్పుకున్నావే రాములా అంటూ ఇద్దరూ అభినయించారు. రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో... నా ప్రాణం తీసిందిరో అంటూ సాగే పాటకు నృత్యం చేశాడు.
ఇప్పుడు ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలు చూసిన నెటిజన్లు... ఆ పాటల పంక్తులే నీ జీవితంలో నిజమయ్యాయిరో రమేశో రమేశా అంటూ... స్వప్నను తిట్టిపోసుకుంటున్నారు. కేసును ఛేదించిన పోలీసులు ప్రియుడు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి సజీవదహనం