Cyclone Effect in Krishna District: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మిగ్ జాం తుపాను కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికలు మేరకు తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజుబాబు సూచించారు. తుపాను తీవ్రత దృష్ట్యా కృష్ణా జిల్లాలో మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావిత ఏడు మండలల పరిధిలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించామన్నారు.
దివిసీమలో ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి వర్షం మొదలైంది. మిగ్ జాం తుపాను ప్రభావంతో కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో తుపాను పరిస్థితులను పర్వవేక్షించేందుకు దివిసీమలో ప్రత్యేక అధికారులను నియమించారు.
తుపాను షెల్టర్లను గుర్తించి వచ్చిన ప్రజలకు తాగునీరు, ఆహారం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. నాగాయలంక, కోడూరు మండలాలకు సమన్వయ అధికారులను నియమించారు. ఈ రెండు మండలాల సరిహద్దుగా బంగాళాఖాతం వైపు ఉన్న సముద్ర కరకట్ట పూర్తిగా శిథిలమవటంతో తుపాన్లు, సునామీల సమయంలో ఆ ప్రాంతానికి ముప్పు పొంచి ఉండటంతో దివిసీమ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
దూసుకొస్తున్న మిగ్జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు
తుపాన్లు వచ్చినప్పుడు ప్రజలు తలదాచుకోవడానికి దివిసీమలో గతంలో సుమారు 40 పైగా తుపాను షెల్టర్లు నిర్మించారు. అయితే అవి శిథిలావస్థకు చేరుకోవటంతో వాటిలో సుమారు 35 షెల్టర్లు కూల్చివేశారు. వాటి స్థానంలో ఇప్పటికీ ఒక్కటి కూడా నిర్మించలేదు. దివిసిమలో లక్ష ఎకరాల్లో వరి పంట కోత దశకు చేరుకుంది. ఈ సమయంలో గాలుల, వర్షాలు పడటం వల్ల తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో మెట్ట ప్రాంతంలో సుమారు 60 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న అరటి, బొప్పాయి, టమోటో, మిర్చి ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు దిగాలుగా ఉన్నారు. ఇప్పటికే వరి కోతలు కోసుకున్న రైతులు ధాన్యాన్ని రోడ్ల ప్రక్కన ఆరబెట్టుకున్నారు. గత ప్రభుత్వం రైతుకు సబ్సిడీ పై టార్పలిన్ పరాజలు ఇచ్చేదని, ఈ ప్రభుత్వం కనీసం ఒక్క పరజా కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు.
మిగ్ జాం తుపాను ప్రభావంతో గన్నవరం నియోజకవర్గంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. వాతావరణ మార్పుతో రైతులకు కంటి మీద కునుకు కురువైంది. నియోజకవర్గంలో అత్యధికంగా సాగు చేస్తున్న వరి పంట కోతలు ముమ్మరమైన సమయంలో ప్రారంభమైన తుపాను నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు. వాతావరణం అనుకూలించని సమయంలో నిబంధనలను సడలించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తుపాను బాధితులకు అండగా నిలవాలని నేతలకు సీబీఎన్ పిలుపు - సైక్లోన్ ఎఫ్టెక్ట్తో యువగళానికి బ్రేక్
తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు కోతలు మరోవైపు ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడం, ధాన్యం రాశులపై పట్టాలు కప్పుకోవటానికి రైతులు పరుగులు తీస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం లోని పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో ప్రస్తుతం పదివేల ఎకరాల్లో వరి కోతలు ముమ్మురంగా సాగుతున్నాయి.
గత రెండు రోజులుగా బలమైన గాలులు వీస్తూ వర్షపు జల్లులు పడుతున్నాయి. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేల వాలుతోంది. ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు రైతుల వద్ద సరైన టార్పలిన్ పట్టాలు అందుబాటులో లేవు. వైసీపీ సర్కారు హయాంలో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పట్టాల సరఫరా నిలిపివేశారు. ఈ పట్టాల ధరలు ప్రైవేటు దుకాణాల్లో అధికంగా పలకటంతో రైతులకు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
ఈ తరుణంలో వర్షాలు కురుస్తుంటే చేతిలో టార్పలిన్ పట్టాలులేకపోవటంతో పంటను ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిబంధనలను సడలించి తేమ శాతంతో పనిలేకుండా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
విస్తరించిన మిచౌంగ్ తుపాన్ - ఉప్పొంగిన తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది