Cyber frauds in Telangana : 'మిత్రమా నా దగ్గరున్న డబ్బుతో ఒక అద్భుతం జరిగింది. బిట్ కాయిన్లో రూ.5 వేలు పెట్టుబడి పెడితే మూడు గంటల్లోనే రూ.లక్ష అయ్యింది. కావాలంటే కింద ఉన్న స్క్రీన్షాట్లు చూడండి. ఈ లింకు తెరిచి పెట్టుబడి పెట్టండి' అని మీకు తెలిసిన వారి నుంచి సందేశం వస్తే.. ఏంటని అడగకుండా లింకు తెరిచి పెట్టుబడి పెడితే అంతే సంగతులు. ఎందుకంటే మోసం చేయడంలో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్న ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైతే పోతే పోయింది.. కొత్తది ప్రారంభించవచ్చని తేలిగ్గా వదిలేశారో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోంది.
హ్యాక్‌కు గురయ్యే ఖాతాల్లో ఎక్కువగా మహిళలు, యువతులకు సంబంధించినవే ఉంటున్నాయి. సైబర్ నేరగాళ్లు వ్యూహాత్మకంగానే మహిళల ఖాతాలను ఎంచుకుంటున్నారు. యువతులు, మహిళలు రీల్స్ ఎక్కువగా పోస్టు చేస్తుంటారు. వీరి ఖాతాను అనుసరించే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వారి ఖాతాలను తేలిగ్గా హ్యాక్ చేస్తున్నారు. వాళ్ల ఫొటోలు, వీడియోలు సేకరించడంతోనే ఆగడం లేదు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ వారి ఖాతా నుంచి ఫాలోవర్లకు నకిలీ లింకులు పంపిస్తున్నారు. పెట్టుబడులు పెట్టాలంటూ, క్రిప్టో కరెన్సీలో మదుపు చేస్తే లాభాలంటూ స్నేహితులకు సందేశం పంపిస్తారు.
మోసపోయాక గుర్తిస్తున్నారు..: నమ్మించేందుకు లాభాలు వచ్చినట్లు కొన్ని ఫొటోలు చూపిస్తారు. కొందరు ఆ సందేశాలు చూసి లింకు ద్వారా రూ.లక్షల్లో నగదు పెడుతున్నారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించే నిందితుడు.. భారీగా సొమ్ము పెట్టాక డబ్బు తిరిగి తీసుకునేందుకు వీలు లేకుండా చేస్తాడు. ఖాతా నిర్వహించే అసలు వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు మోసపోయామని బాధితులు గుర్తిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలా రూ.30 లక్షలు మోసపోయారు. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు నమ్మొద్దని సైబర్ నిపుణలు చెబుతున్నారు.
అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య తగ్గట్లేదు..: గత కొన్ని నెలలుగా ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేస్తున్న కేసులు హైదరాబాద్‌లో గణనీయంగా పెరుగుతున్నట్లు సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు పోలీసులు ఎంత అవగాహన కల్పించినా మోసాల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..