రాష్ట్రంలో నాడు - నేడు పథకం కింద ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలకు స్వంత భవనాల నిర్మాణానికి స్థలాల గుర్తింపుపై అధికారులతో చర్చించారు.
ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులపై చర్చ
ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు 439 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాట్లపై సీఎస్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ ఎస్ఈలు సమన్వయంతో పనిచేసి వీటిని త్వరగా అందుబాటులోకి తేవాలని సూచించారు. పరిశుభ్రత కార్యక్రమాలు, ఐఓసి పైపులైను ఏర్పాటుకు స్థలం కేటాయింపు అంశాలపై చర్చించిన ఆమె.. విద్య, వైద్య పరంగా మౌలిక సదుపాయాల కల్పన నిర్దిష్ట గడువు ప్రకారం జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఓడీఎఫ్లుగా ప్రకటించాలి
వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం లేని ఎస్సీ ఎస్టీల కుటుంబాలను గుర్తించి వెంటనే మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. వచ్చే జనాభా లెక్కల సేకరణ సమయానికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాల్సి ఉందని అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒడిశాలోని పారాదీప్ నుంచి రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మీదగా హైదరాబాదు వరకూ నిర్మిస్తున్న పైపు లైను నిర్మాణానికి ఆయా జిల్లాల్లో అవసరమైన స్థలం మార్కెట్ ధరకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎస్‌కు తెలిపారు. ప్రతి చెక్ పోస్టులోనూ సీసీ కెమెరా ఏర్పాటుకు తగిన స్తంభం, మరుగుదొడ్డి వంటి సౌకర్యాలను కల్పిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు.
ఇదీ చూడండి: