రైతులు పండించిన పంటల సేకరణ రైతు భరోసా కేంద్రాల నుంచే జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కర్షకులకు గిట్టుబాట ధర తప్పకుండా రావాలని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌లో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెటింగ్ సదుపాయాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ప్రతీ రైతు భరోసా కేంద్రం(ఆర్‌బీకే) వద్ద పంటల కనీస మద్దతు ధరలతో పెద్ద డిస్‌ప్లే బోర్డు ఉండాలి. భవిష్యత్తులో ఆర్‌బీకేలన్నీ ధాన్యం సేకరణ కేంద్రాలుగా నిలవాలి. ఏ పంట వేస్తే ఎంత లాభం ఉంది?... ప్రస్తుతం మార్కెట్‌లో దాని ధర ఎంత? వంటి అన్ని అంశాలపై రైతులకు చెప్పటంతో పాటు ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలి. పంటలు పండిన తర్వాత మార్కెటింగ్‌కు ఇబ్బందులు రాకుండా చూడాలి. వీటన్నింటినీ జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలి. వాటర్ రియాలిటీ, మార్కెట్ రియాలిటీ ఆధారంగా జేసీలు రైతులకు అవగాహన కల్పించాలి. పంటల అమ్మకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలి. పత్తి కొనుగోళ్లలో అవినీతి జరగకూడదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచి రైతుకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ- మార్కెటింగ్ వేదికపై మరింత దృష్టి సారించాలి. బహిరంగ మార్కెట్‌లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారుల వివరాలను ఈ- మార్కెటింగ్‌కు అనుసంధానం చేయాలి. ఈ ఖరీఫ్ సీజన్‌లో కూడా దాదాపు 3300 కోట్ల రూపాయల మేర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలి. ధరల స్థిరీకరణ నిధిని కూడా వినియోగించుకోవాలి- జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి