పదేళ్ల పాప సహా ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్యలు గావించిన ఘటన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో సోమవారం సంచలనం రేకెత్తించింది. విస్సన్నపేట సమీపంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువ వద్ద ఉదయం నడకకు వెళ్లినవారు రోడ్డుప్రమాదం చోటు చేసుకున్నట్లు భావించి, పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన ముగ్గురూ కాలువ ఒడ్డు నుంచి సుమారు ఐదు అడుగుల లోతులోని తుప్పల్లో విగతజీవులుగా పడి ఉన్నారు. వీరు ఉపయోగించిన ఆటో సగభాగం మాత్రమే కాలువలోకి వెళ్లి, రోడ్డుపైనే నిలిచిపోయింది. ఆటో అద్దాలను కర్రతో పగులగొట్టినట్లు ఉంది. వాహనంలోని పింగాణి వస్తువులు చెల్లాచెదురు కాలేదు. ముందుగా స్థానిక ఎస్‌ఐ సంఘటన స్థలం వద్దకు చేరుకొని విచారించారు. ఇది రోడ్డు ప్రమాదం అనుకొని, తర్వాత మృతదేహాలపై గాయాలను చూశారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు నందిగామ, నూజివీడు డీఎస్పీలు రమణమూర్తి, బి.శ్రీనివాసులు చేరుకొని విచారణ చేపట్టారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన పెళ్లూరి చిన్నస్వామి (35), అతని భార్య తిరుపతమ్మ (30), కుమార్తె మీనాక్షి (10)ల మృతి తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ తర్వాత వీరు హత్యలకు గురైనట్లు భావించామన్నారు. భార్యాభర్తలను తీవ్రంగా గాయపరచడంతోపాటు వారి కుమార్తెను తాడుతో మెడ నులిమిన గాయాలు ఉన్నాయని వివరించారు. చిన్నస్వామి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఈ హత్యలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన వ్యాపారి దాసరి వెంకన్న పాత్రపై అనుమానాలున్నాయని, పూర్తి స్థాయిలో పలు బృందాలతో విచారణ చేస్తామని చెప్పారు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
మృతదేహాలు పడి ఉన్న చోటుకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడితోటలో హత్యలకు సంబంధించిన ఇనుపరాడ్డు, కట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో హత్యలు చేసి సాగర్ కాలువ వద్దకు తీసుకువచ్చి నిందితులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. తన కుమారుడు పెళ్లూరి చిన్నస్వామి(35) తొలి నుంచి కాయకష్టంపై ఆధారపడ్డాడని తండ్రి లింగయ్య చెప్పారు. చింతలపూడికి చెందిన వడ్డీ వ్యాపారి దాసరి వెంకన్న వద్ద అప్పు చేసి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ సమయంలో సంబంధిత వ్యాపారితో తన కుమారుడికి మధ్య వాగ్వాదం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం సొంత వ్యాపారం మాని నూజివీడుకు చెందిన మరో వ్యాపారి సుబ్బారావు వద్ద తన కుమారుడు పని చేస్తున్నారని వివరించారు. నూజివీడు వ్యాపారి సుబ్బారావుకు చెందిన ఆటోలో అతను సమకూర్చిన పింగాణి వస్తువులతో కలసి ఊరూరా తిరిగి విక్రయిస్తూ సంతోషంగా జీవితం గడుపుతుండగా, ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకుతో ఎవరికీ కక్షలు లేవని, ఎందుకు ఇలా జరిగిందో తెలియటంలేదన్నారు. తిరువూరు, మైలవరం సీఐలు ఎం.శేఖర్‌బాబు, పి.శ్రీను, పలువురు ఎస్‌ఐలతో కలసి ఘటనాస్థలిలో పోలీసులు విచారించారు. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ బృందాలు సైతం ఇక్కడికి చేరుకున్నాయి.
ఇదీ చదవండి: 'న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగుల వెనుక కుట్ర'