కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లురుకి చెందిన వైకాపా నేత, మాజీ సర్పంచ్ తన అనుచరులతో ఇటీవల తెదేపాలో చేరారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ పదవి ప్రతిపక్ష తెదేపాకు ఏకగ్రీవం అవుతుందన్న అక్కసుతో...పాత కక్షలను రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తెదేపా కార్యకర్తల ఇళ్లపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురు మహిళలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తెదేపాలో చేరిన మాజీ సర్పంచ్, తన అనుచరులను తిరిగి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వైకాపాలో చేర్చుకున్నారు. ఈఘటనలో సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాలు, టీవీలు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగ్గయ్యపేట సీఐ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో తాళ్లూరులో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వైకాపా నాయకులతో శనివారం గ్రామానికి వచ్చి వెళ్లిన తర్వాతే వైకాపా నాయకులు తమపై దాడులకు పాల్పడ్డారని తెదేపాకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: గోడల మధ్య చిక్కుకున్న బాలుడు.. బయటకు తీసిన పోలీసులు