కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో కోడిపందాల జోరుగా నిర్వహిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలు, ప్రభుత్వం, కోర్టుల ఆదేశాలను ధిక్కరించి.. నిర్వాహకులు బరులు ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతుండగా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచీ పందెం రాయుళ్లు జిల్లాకు చేరుకున్నారు. కరోనా నిబంధనలు గాలికొదిలేసి.. షామియానాలు వేసి మరీ పందాలు జరుపుతున్నారు.
కైకలూరులో...
![cock fights in kaikaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10226822_kaikaluru1.jpg)
కైకలూరు మండలం ఆలపాడులో కోడి పందేలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. పోలీసులు హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ.. షామియానాలు వేసి మరీ కోడిపందేలను కొనసాగిస్తున్నారు. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి పందాలు నిర్వహిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచీ పందెం రాయుళ్లు తరలివచ్చినట్లు చెబుతున్నారు.
నందిగామలో...
![cock fights in nandigama](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10226822_nandigama2.jpg)
నందిగామ నియోజకవర్గంలో జోరుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. నిన్నటిదాకా బరులను ధ్వంసం చేసిన పోలీసులు.. ఇప్పుడు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చందర్లపాడులో ఏర్పాటు చేసిన భారీ బరుల్లో ఉదయం నుంచి నిర్వాహకులు పందేలు నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. బరుల వద్ద మద్యం విక్రయాలు జరుపుతున్నారు. పేకాట, ఇతర జూదాలూ ఊపందుకున్నాయి. ఈ తరహా కార్యకలాపాలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బాపులపాడులో...
![cock fights in bapulapadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10226822_bapulapadu3.jpg)
బాపులపాడు మండలం అంపాపురంలో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం నలుమూలల నుంచి పందెంరాయుళ్లు భారీగా బరుల వద్దకు చేరుకున్నారు. పందేలను వీక్షించేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు.
ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు