CM Jagan Silence in Krishna Water Issue: కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్లైబ్యునల్ ఏర్పాటుతో ఏపీకి తీవ్ర నష్టమంటూ..విపక్ష నేతలు, సాగు నీటిరంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. సీమ ప్రాజెక్టులు.. ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నా.. జగన్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ.. గెజిట్ విడుదల తర్వాత తీరిగ్గా.. జగన్ లేఖ రాయడం కాస్త విడ్డూరంగా ఉంది. రాష్ట్రంపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటించారు. కానీ కళ్లెదుటే.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. జగన్ నోరు విప్పలేదనే వాస్తవం.. నాటి అపెక్స్ కౌన్సిల్ మినిట్స్‌లో స్పష్టంగా కన్పిస్తుంది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కృష్ణా అపెక్సె కౌన్సిల్ ఏర్పాటైంది. 2020 అక్టోబరు 6న వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సర్వోన్నత మండలి సమావేశం జరగ్గా.. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆ సమయంలోఏపీ తరఫున జగన్ వ్యతిరేకత చెప్పలేదు. అప్పటికే కొత్త ట్రైబ్యునల్‌ను డిమాండ్ చేస్తూ.. సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేసినందున దాన్ని ఉపసంహరించుకుంటే తామూ ఈ అంశంపై న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకుంటామని షెకావత్ చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశంపై మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా చర్చిస్తుంటే.. ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన జగన్.. మౌనం వహించారు. అప్పుడే అసమ్మతిని వ్యక్తం చేసి ఉంటే.. కృష్ణా జలాల పున:పంపిణీపై ఏకాభిప్రాయం సాధించినట్లు అయ్యేది కాదు. ఆనాడు జగన్ మౌనమే అంగీకారమై.. కేంద్ర నిర్ణయానికి బీజం పడిందని సాగు నీటిరంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు.
కాగా కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు (Brijesh Kumar Tribunal) అప్పగించాలని కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని వలన కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత, రాష్ట్రాల వారీగా అవసరాలు.. తదితర అంశాలపై ట్రైబ్యునల్ మరోసారి విచారణ చేపట్టాల్సి ఉంటుంది.
2020 అక్టోబరు 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగడానికి ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జలవనరులశాఖ మంత్రికి ఈ అంశంపై ప్రత్యేకంగా లేఖ రాయడంతోపాటు అపెక్స్ కౌన్సిల్‌లో దీని గురించి చర్చించారు. ఇదే విషయాన్ని 2021 జూన్ నెలలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శికి లేఖ ద్వారా తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో నిర్ణయించినట్లుగా ట్రైబ్యునల్‌కు అప్పగించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరచూ దీని గురించి మాట్లాడుతోంది. ఇలా కొన్ని సంవత్సరాలుగా నలుగుతూ వచ్చిన ఈ అంశానికి కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.