ఆర్థిక సర్వే 2020 - 21ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. నవరత్నాలు, రైతు సంక్షేమం, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక ప్రగతి, సుస్థిరాభివృద్ధి సూచిక అంశాలను ప్రభుత్వం సర్వేలో వెల్లడించింది.
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. లాక్డౌన్, కర్ఫ్యూ సమయాల్లో, ప్రభుత్వం పేదలకు సహాయం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా కోటి 80 లక్షల 49 వేల 54 నమూనాలను పరీక్షించారని, ఇందులో 14 లక్షల 54 వేల 052 మందిని పాజిటివ్‌గా నిర్దారించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం క్రయోజెనిక్ ట్యాంకర్లను విదేశాల నుంచి కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రానికి రోజుకు 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించారని, దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించిందన్నారు. ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారిలో 53.28 లక్షల మందికి తొలి డోసు వాక్సిన్ ఇచ్చామన్న ప్రభుత్వం.. 21.64 లక్షల మందికి రెండో మోతాదు అందించామన్నారు.
వాక్సిన్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. ఎక్కువ మంది ప్రయోజనం పొందడానికి వీలుగా రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కోటి 44 లక్షల కుటుంబాలకు ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 1,577 నెట్‌వర్క్ ఆస్పత్రులను ఎంపానెల్ చేశామని, 2,436 విధానాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కింద సేవలు అందించేందుకు 1,484 ఎంపానెల్డ్ నెట్‌వర్క్ ఆస్పత్రులు, 1059 విధానాలను కలిగి ఉన్నాయన్నారు. ఈ పథకం కింద 5 లక్షల 33 వేల 670 మంది రోగులకు 1902.35 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు.
శస్త్ర చికిత్స అనంతరం రోగులకు రోజుకు కనిష్టంగా రూ.225 నుంచి గరిష్టంగా రూ. 5 వేల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. డా. వైఎస్ఆర్ కంటి వెలుగు మిషన్ కింద 3 ఏళ్లలో 6 దశల్లో ఉచితంగా అందరికీ మాస్ఐ స్క్రీనింగ్ సేవలు అందించామన్నారు. వైఎస్ఆర్ చేయూత కింద పేద మహిళలను ఆదుకునేందుకు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ. 4604.13 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, కాంట్రాక్ట్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు వైఎస్ఆర్ ఆసరా కింద రూ. 6 వేల 792.21 కోట్లను, రూ. 87 లక్షల 74 వేల 674 మహిళా స్వయం సహాయక సంఘ సభ్యుల రుణ ఖాతాల్లో జమ చేసినట్లు నివేదికలో ప్రభుత్వం తెలిపింది. గృహ నిర్మాణం, సామాజిక భద్రత, సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపిన ప్రభుత్వం.. హౌసింగ్ - పేదలందరికీ ఇల్లు కింద, అర్హతగల మహిళా లబ్ధిదారులందరికీ 27.94 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశామని పేర్కొంది. రెండు దశల్లో రూ.28.30 లక్షల వ్యక్తిగత గృహాలను నిర్మించనున్నట్లు తెలిపింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టి ఫేజ్ -1 కింద 15.60 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు.. ఇందుకు రూ.1487 కోట్ల విలువైన పెన్షన్లుసను వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారుల ఇంటి వద్దనే ప్రతీ నెల మొదటి రోజు సుమారు 61.73 లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది. డయాలసిస్ చేయించుకుంటున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రోగులకు 3వేలు, 10 వేలచొప్పున ఆర్ధిక సాయం చేస్తున్నట్లు తెలిపారు.- జగ్జీవన్ జ్యోతి పథకం కింద 15.63 లక్షల ఎస్సీ, 5.23 లక్షల మంది ఎస్టీ గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. 53 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 2.74 లక్షల స్వయం యాజమాన్యంలోని ఆటో లేదా టాక్సీ యజమానులకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద ప్రతి బీపీఎల్లోని చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24 వేలు అందిస్తున్నట్లు నివేదికలో తెలిపారు.
వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద రైతు కుటుంబాలకు ఏటా 13 వేల 500 రూపాయల ఆర్ధిక సాయం చేస్తున్నట్లువెల్లడించారు.ఇప్పటి వరకు 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని దీనికోసం మొత్తం 17 వేల30 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉచిత పంట భీమా - పంట భీమా ప్రీమియం చెల్లింపు కింద ప్రభుత్వం ఇప్పటివరకు 5.67 లక్షల మంది రైతులకు 1968 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. 1 లక్ష లోపు పంట రుణాన్ని తిరిగి చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు సహా ,ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటంబానికి 7 లక్షలు చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. వైయస్ఆర్ బీమా కింద మత్స్యకారులకు 10 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 వేల778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సర్వేలో ప్రభుత్వం తెలిపింది.
గ్రామంలో విత్తనాలు, ఎరువులు,పురుగుమందుల వంటి నాణ్యమైన ఇన్ పుట్ లను సరఫరా చేసే లక్ష్యంతో ప్రతి గ్రామ సచివాలయంలో ఒకటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యాన పంటలలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉందని సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయిల్ పామ్, బొప్పాయి, లైమ్, కోకో, టొమాటో ఉత్పాదకతలో 1 వ స్థానంలో ఉందన్నారు. జలయజ్ఞ్నం కింద 54 సాగునీటి ప్రాజెక్టులలో 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ప్రధానమైన 2 ప్రాజెక్టులలో ఒకటో దశ పూర్తైందన్నారు. పోలవరం ,సహా పూల సుబ్బయ్య ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా, కింద చేపల వేట నిషేధ కాలంలో అందించే భృతి మొత్తాన్ని 10 వేలకు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2020-21లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 168.31 లక్షల టన్నులు కాగా, 2019-20లో 175.12 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే అన్ని పరిశ్రమలలో స్థానిక యువతకు 75శాతం ఉద్యోగాలు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‘వై.ఎస్.ఆర్ జగన్నన్న బడుగు వికాసం’ కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు వెల్లడించింది. “డాక్టర్ వై.ఎస్.ఆర్ నవోదయం” ప్రోగ్రామ్ - ఎంఎస్‌ఎంఇ ల కోసం కొత్త పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలులోని ఓర్వకల్లు వద్ద ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి విమానాశ్రయం కార్యకలాపాలుప్రారంభించినట్లు తెలిపారు. మచిలిపట్నం, భావనపాడు కాకినాడ సెజ్ ,రామాయపట్నం వద్ద 4 మేజర్ పోర్టులు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు.
2020-21 సంవత్సరానికి అడ్వాన్స్ అంచనాల ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర GSDP వృద్ధి 1.58 శాతం ఉన్నట్లు నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జాతీయ స్థాయి వృద్ది 3.8 శాతం ఉందని నివేదికలో తెలిపారు. ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2019-20లో 1లక్ష 68 వేల480 ఉండగా అక్కడి నుండి 2020-21లో 1 లక్ష 70 వేల215 కు పెరిగిందని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. 2019-20 సంవత్సరానికి భారతదేశ తలసరి ఆదాయం 1 లక్ష 34 వేల186 గా ఉందని తెలిపారు. 2030 నాటికి సాధించాల్సిన 17 ఎస్‌డిజిలను యుఎన్ స్పాన్సర్ చేసిందని తెలిపారు.
దేశంలోని రాష్ట్రాల మధ్య మొత్తం ఎస్‌డిజి ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2018 లో 4 నుంచి 2019 లో 3 వ స్థానానికి మెరుగుపడిందని నివేదించింది. నీతి ఆయోగ్ తాజా గా 2019 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 ఎస్‌డిజిలలో - గోల్ -6 , పరిశుభ్రమైన నీరు ,పారిశుధ్యం, అలాగే గోల్ -16 శాంతి, న్యాయం ,బలమైన సంస్థలు లో 1 వ ర్యాంకును సాధించిందని నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 ఎస్‌డిజిలలో 2 వ ర్యాంకును సాధించిందని తెలిపింది. ,మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక వృద్ధి,వాతావరణ మార్పు, లైఫ్ బిలో వాటర్ , పేదరికం లేని అంశాల్లో రాష్ట్రం మూడో ర్యాంకు సాధించిందని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిచింది.
ఇవీ చూడండి : ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు