నూజివీడులో అమరావతి క్యాపిటల్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎదుట ఖాతాదారులు నిరసన చేపట్టారు. నిర్వాహకులు సమాధానం చెప్పి, డిపాజిట్లు చెల్లించే వరకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. గడువు తీరినప్పటికి డిపాజిట్ సొమ్ము.. తిరిగి ఇవ్వటం లేదని ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్టిన సొమ్ముకు రెట్టింపు రుణాలు మంజూరు చేస్తామని.. తమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సొసైటీపై భవాని అనే గృహిణి ఫిర్యాదు చేసిన మేరకు దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ బి. శ్రీనివాసులు తెలిపారు. అమరావతి సంస్థలో రోజు వారీగా ఏడాదిపాటు డిపాజిట్ చేస్తే 8 శాతం, రెండేళ్ల పాటు డిపాజిట్ చేస్తే 12 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి భారీగా డిపాజిట్లు సేకరించినట్లు డీఎస్పీ వివరించారు. డిపాజిట్లు చేసిన వారికి అవసరం మేరకు రుణాలు కూడా అందించనున్నట్లు సంస్థ నమ్మించటంతో.. చిరు వ్యాపారులు, మధ్యతరగతి వ్యక్తులు డిపాజిట్లు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కేసులో ఖాతాదారులు అందరికీ చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఎం ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశానుసారం సీఐ వెంకటనారాయణ నేతృత్వంలో 3 ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు చెందిన నిర్వాహకులపై చర్యలకు సమాయత్తమవుతున్నట్లు వివరించారు. దర్యాప్తు ముగియగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని.. డీఎస్పీ బి. శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి: