untimely rains : రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, తదనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. సీఎంఓ అధికారులతో కలిసి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు వెంటనే అన్నిరకాల చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మరోవైపు కోతలు పూర్తయిన ధాన్యం కూడా వర్షాల బారి నుంచి కాపాడేందుకు చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద.. ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వెంటనే అందుబాటులోని గోదాములు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కాగా, ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చుల కింద ప్రతి కలెక్టర్‌కూ కోటి రూపాయలను ఇప్పటికే కేటాయించామని అధికారులు సీఎంకు వివరించారు.
రైతులకు అవగాహన.. ఇన్‌పుట్ సబ్సిడీని విడుదలకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం వర్షాలు, పంట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ద్వారా రైతులకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. చేలల్లో మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవడానికి విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పారు.
రైతులకు తప్పని అగచాట్లు... మరో వైపు అకాల వర్షాలతో కల్ల్లాలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు అగచాట్లు తప్పడం లేదు. పట్టాలతో కప్పినా ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో లబోదిబోమంటున్నారు. పెట్టుబడైనా వస్తుందో లేదోనని రైతులు దిగాలు చెందుతున్నారు. పట్టాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశామని, 20 రోజులుగా కల్లాలవద్దే ఉంటున్నా వర్షానికి ధాన్యం తడిచి మొలకెత్తుతోందని కన్నీటిపర్యంతం అవుతున్నారు. అకాల వర్షాలు నట్టేటా ముంచాయని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన మిర్చి తడిసిపోయిందని, మందులు, కూలీల కోసం చేసిన ఖర్చులైనా వస్తాయో లేదో అర్థం కావడంలేదని వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మామిడి రైతు కుంగిపోతున్నాడు. గాలివానకు మామిడికాయలు రాలిపోతున్నాయి. గత 40 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో మద్దతు ధర కూడా దక్కడం లేదంటున్నారు. అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యం, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
ఇవీ చదవండి :