వ్యవసాయ రంగం ప్రధానమైన కృష్ణా జిల్లా రైతులకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో కొంత ఊరట లభించింది. పంటరుణాలతో పాటు కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు లభించింది. దాదాపు 1.35లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో వీధి వ్యాపారులకు వెంటనే ప్రయోజనం లభించనుంది. ఒక్కొక్క వ్యాపారికి గరిష్ఠంగా రూ.10వేల ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా జిల్లాలో దాదాపు 70 వేల మంది వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కొన్ని అంశాలకు సంబంధించి ప్యాకేజీ వివరాలు ప్రకటించారు. ప్రధానంగా వ్యవసాయ రంగం, వలస కూలీలు, వీధివ్యాపారులపై కనికరం చూపారు.
జిల్లాలో మొత్తం 6.27లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరు ప్రతి ఏటా పంట రుణాలు తీసుకుంటున్నారు. జిల్లాలో రైతు భరోసా ఖాతాలు 4.35లక్షలు ఉన్నాయి. 4.20లక్షల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. పంటరుణాలు తీసుకున్నవారికి 3నెలలు మారిటోరియం ఇవ్వనున్నారు. అందరికి క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. తక్కువ వడ్డీకే రుణాలు అందనున్నాయి. కౌలు రైతులు రుణ అర్హత కార్డులు కలిగిన వారు 1.35 లక్షల మంది ఉన్నారు.
విజయవాడ నగరంలో దాదాపు 44వేల మంది వీధి వ్యాపారులు ఉన్నారు. కానీ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు తీసుకున్న వారు 11 వేల మంది మాత్రమే ఉన్నారు. వీరికి గరిష్ఠంగా రూ.10వేల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. రుణం కింద దీన్ని ఇస్తారు. వాయిదాలు సక్రమంగా చెల్లించే వారికి రుణ అర్హత పెరుగుతుంది.
జిల్లాలో ఇప్పటికే ముద్ర రుణాలు తీసుకున్న వారికి మూడు నెలలు మారటోరియం విధించారు. జిల్లాలో వీరు కేవలం 50 వేల మంది మాత్రమే ఉన్నారు.
జిల్లాలో సీజన్‌లో 4వేల మంది వరకు వలస కార్మికులు ఉంటారు. వివిధ పనుల్లో పాల్గొనే వారు. వీరికి ఆహార ధాన్యాలు అందించనున్నారు. ఇప్పటికే సగం మంది సొంత గ్రామాలకు వెళ్లారు. మిగిలిన వారు దీని వల్ల లబ్ధిపొందే అవకాశం ఉంది. కనకదుర్గ పై వంతెన, ఎల్‌అండ్‌టీ పనులు ఇతర కర్మాగారాల్లో వీరు పనిచేస్తున్నారు.
జిల్లాలో త్వరలో నివేశన స్థలాలు కేటాయించనున్నారు. వీరికి గృహనిర్మాణంపై ఆశలు చిగురించేలా ప్యాకేజీ ప్రకటించారు.